అవసరమైతే తప్పా ప్రజలు ఎవరు బయటకు రావద్దు
వెంటనే సహాయక చర్యలు చేపట్టండి
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
హుజురాబాద్, విజయక్రాంతి: విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందేనని, హుజురాబాద్ నియోజకవర్గంలోని అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాదులోని తన నివాసం నుంచి ఫోన్ సంభాషణలో ఆర్డీవోకి సమాచారం అందించారు.
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే రాష్ట్రం అంతా అతలాకుతలం అవుతుందన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండి ఎలాంటి విపత్తునైనా ఎదుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. జమ్మికుంటలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ తో పాటు హుజరాబాద్ లోని 17వ వార్డు ఇప్పటికే జలమయ్యాయని జలమయం అయ్యాయని, వెంటనే ఈ ప్రాంతాలకు సహాయక చర్యలు అందించాలన్నారు.
అలాగే నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి ఆస్తి నష్టంతో పాటు ప్రాణం నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. నియోజకవర్గం లోని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే తప్పా బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ బావుల దగ్గరికి వెళ్లే రైతులు సైతం చాలా జాగ్రత్తగా ఉండాలని, మోటర్లు ఆన్ చేసే అప్పుడు తడిచేతులతో తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.