calender_icon.png 23 October, 2024 | 3:52 AM

ఎమ్మెల్యే ఔదార్యం

22-07-2024 02:46:01 PM

బాధితులకి 10000 చొప్పున ఆర్థిక సహాయం

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి


హుజురాబాద్, విజయ కాంతి:  పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా ఎదురుగా ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో పండ్ల బండ్లు పూర్తిగా కాలిపోవడంతో తనవంతుగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తనకు వచ్చిన జీతాన్ని సోమవారం బాధితులకు తల ఒక్కరికి పదివేల చొప్పున రూ .3 లక్షల 10వేలు అందజేశారు.  అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం అందజేయడంతో పాటు తన వంతుగా రేకుల షెడ్డుల కొరకు లక్ష రూపాయలు ఇచ్చానన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఆర్డీవో, తాసిల్దార్, మున్సిపల్ కమిషనర్ సందర్శించి పరిశీలించి పూర్తి నివేదికను ప్రభుత్వానికి నివేదించినప్పటికీ వారం రోజులు దాటిన కనీస నష్టపరిహారం మంజూరు చేయకపోవడం బాధాకరమన్నారు.

జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ అగ్నిప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించకపోవడం వారిని ఆదుకునేందుకు కనీస ప్రకటన చేయకపోవడం మంత్రి నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు బాధితులను పట్టించుకోవడం లేదని, అధికారులు వచ్చి ఎంక్వయిరీ చేసి వెళ్లిపోయారు కానీ ఎలాంటి వారికి ఆర్థిక సహాయము చేయకపోవడం బాధాకరమన్నారు. అగ్ని ప్రమాద బాధితులు తెలంగాణ రాష్ట్రంలో లేరా జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ కి గాని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గాని వర్తించరా అని ఆయన ప్రశ్నించారు. పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరిగి లక్షలాది రూపాయల ఆస్తి నష్టం జరిగితే కనీసం పరామర్శించకపోవడం జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ చిన్న చూపుకు నిదర్శనం కాదా అని కౌశిక్ ప్రశ్నించారు. అగ్ని ప్రమాద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. ఇట్టి విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో తాను ప్రస్తావిస్తాననీ స్పష్టం చేశారు. బాధితులకు శాశ్వత ప్రతిపాదికన పునరవాసం కల్పించి అన్నవిధాల ఆదుకోవాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.