* హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు తరలింపు
* నేడు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్న పోలీసులు
హైదరాబాద్ సిటీబ్యూరో/ కరీంనగర్, జనవరి 13(విజయక్రాంతి): జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌తో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అనుచితంగా ప్రవర్తించారని ఆదివారం రాత్రి రెవెన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తు మల్లేశం, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ పీఏ కత్తరోజు వినోద్‌కుమార్ వేర్వేరుగా కరీంనగర్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో కౌశిక్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని కరీంనగర్‌లోని పోలీస్ శిక్షణా కేంద్రానికి తరలించారు.
మంగళవారం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు. కౌశిక్‌రెడ్డి అరెస్ట్‌ను ఖండిస్తూ మరోవైపు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ మేయరవీందర్ సింగ్ కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తుండగా, పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఆదివారం కరీంనగర్‌లోని కలెక్టరేట్‌లో నిర్వహించిన రైతుభరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్తరేషన్ కార్డుల సన్నాహక సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌సంజయ్‌తో వాగ్వాదానికి దిగారు.
మరికొన్ని కేసులు..
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో మరో మూడు ఫిర్యాదులు అందాయి. సినీ పరిశ్రమ నుంచి రూ.500 కోట్లు వసూలు చేసి సీఎం రేవంత్‌రెడ్డికి ఇచ్చారని సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
కాంగ్రెస్ పార్టీ నేతలతో కౌశిక్‌రెడ్డి అనుచితంగా ప్రవర్తించారని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హుజురాబాద్‌లోనూ అక్కడి కాంగ్రెస్ నాయకులు పోలీసులను ఆశ్రయించి ఎమ్మెలే కౌశిక్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యే సంజయ్ స్టేట్‌మెంట్ రికార్డ్
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే సంజయ్ స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారు.
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోండి
* స్పీకర్‌కు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఫిర్యాదు
జగిత్యాల/ కరీంనగర్, జనవరి 13 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాలో అభివృద్ధి పనులపై ఆదివారం జరిగిన సమీక్ష సమావేశంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అనుచితంగా ప్రవర్తించారని, సదరు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ సోమవారం శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు హైదరాబాద్‌లో స్పీకర్‌ను కలిసి మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో తనను కౌశిక్‌రెడ్డి దూషించారని పేర్కొన్నారు. స్పందించిన స్పీకర్ ప్రసాద్ కుమార్ వెంటనే ఘటనపై నివేదికను తెప్పించుకుంటానని, ఆ తర్వాత తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
కౌశిక్‌రెడ్డి అరెస్టు దుర్మార్గం
* బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ దుర్మార్గమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం రాత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రోజుకో బీఆర్‌ఎస్ నేతను అన్యాయంగా అరెస్ట్ చేయిస్తున్నారని ఆరోపించారు. తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే సీఎం దిగజారుడు పనులకు దిగుతున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో రుణమాఫీని ఎగ్గొట్టారని, దళితబంధుకు పాతరేశారని విమర్శించినందుకే ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిను అరెస్ట్ చేయిస్తున్నారని దుయ్యబట్టారు.
అరెస్టును ఖండిస్తున్నాం:హరీశ్
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్‌రావు సోమవారం రాత్రి ‘ఎక్స్’లో పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకే కౌశిక్‌రెడ్డిపై కేసులు బనాయించారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం ప్రశాంతంగా ఉందని, కాంగ్రెస్ నేతలు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు.