18-04-2025 08:23:16 PM
మానుకోట ఎమ్మెల్యే మురళి నాయక్
మహబూబాబాద్,(విజయక్రాంతి): రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని, రైతు సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా సీఎంతో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం పనిచేస్తోందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అన్నారు. మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, సంఘ ధాన్యానికి రూ.500 క్వింటాల్ కు చొప్పున బోనస్తోందని, ఎలాంటి అక్రమాలకు చోటు లేకుండా ధాన్యం కొనుగోలు నిర్వహిస్తున్నారని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు తమ పండించిన ధాన్యాన్ని బాగా ఆరబెట్టి శుభ్రం చేసి నాణ్యత ప్రమాణాల ప్రకారం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు చూడాలని ఆదేశించారు.
పేదల పాలిట వరం సన్న బియ్యం
గత ప్రభుత్వ హాయంలో కేవలం ధనికులకు మాత్రమే తినే సన్న బియ్యం కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేదలు కూడా తినే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. ఉచితంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం దేశంలోనే చారిత్రాత్మకంగా నిలిచిపోతోందని చెప్పారు. ఈ సందర్భంగా కేసముద్రం మండలం మహమూద్ పట్నం గ్రామంలో ఇసంపల్లి సువర్ణ యుగంధర్ దంపతుల ఇంట్లో సన్న బియ్యంతో వండిన భోజనాన్ని ఎమ్మెల్యే తో పాటు కాంగ్రెస్ నాయకులు ఆరగించారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, డిసిసి ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లం నాగేశ్వరరావు, సొసైటీల చైర్మన్లు మర్రి రంగారావు, దీకొండ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.