calender_icon.png 28 December, 2024 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామగుండంలో పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్

13-09-2024 04:13:07 PM

 సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్

రామగుండం, (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లాలోని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మూతపడే దశకు చేరుకున్న 62. 5 మెగావాట్ల బి- థర్మల్ పవర్ ప్లాంట్ స్థానంలో కొత్త ప్లాంటు ఏర్పాటుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో స్థానికులలో ఉపాధి ఆశలు మొదలయ్యాయి. ఈ మేరకు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ నియోజకవర్గ ప్రజల తరఫున సీఎం రేవంత్ రెడ్డి ని హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలియజేశారు.  గత నెల 31న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో పాటు మంత్రులు  శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్ పలువురు నేతలు ప్లాంటును సందర్శించారు. పాత ప్లాంటు స్థానంలో 1800 మెగావాట్ల నూతన ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

అంతేకాకుండా ప్లాంట్ ఏర్పాటు విషయంలో సాధ్యాసాధ్యాలపై డైరెక్టర్లు, ఇంజనీర్లు పాల్గొని ప్లాంట్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. దీంతో రానున్న రోజుల్లో కొత్త పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ఒక అడుగు పడినట్లు అయింది. దీంతో పవర్ ప్లాంట్ కు సంబంధించి అన్ని రకాల వనరులు స్థలం, నీరు, బొగ్గు, రవాణా తదితరుల సదుపాయాలు ఇక్కడ ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. జెన్ కో ఆధ్వర్యంలో కానీ సింగరేణి సారథ్యంలో గాని పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. వీలైనంత త్వరగా పవర్ ప్లాంట్ ఏర్పాటుకు నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని ఎమ్మెల్యే సీఎంను కోరారు. ప్లాంటు ఏర్పాటు వల్ల భవిష్యత్తులో స్థానికంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు అందుతాయన్నారు. 

రామగుండంలోని మెడికల్ కాలేజీలో అదనపు విభాగాలు, సింగరేణి ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీలో అదనపు విభాగాలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్  కోరారు. మెడికల్ కాలేజ్ లో మరిన్ని సకల సదుపాయాలతో పాటు నర్సింగ్ కాలేజ్, పారా మెడికల్, ఫిజియోథెరపీ కాలేజ్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని కోరారు. తద్వారా హెల్త్ యూనివర్సిటీగా ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుందన్నారు. ఇక్కడున్న పారిశ్రామిక కాలుష్యం నేపథ్యంలో తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అధునాతన సౌకర్యాలతో వైద్య సదుపాయం అందిస్తే కార్మిక కర్షక కుటుంబాలు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటాయన్నారు. ఈ విషయంలో సిఎం సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.