10-04-2025 02:56:45 PM
ఒక్కొక్కటిగా పథకాలను అమలు చేసుకుంటున్నాం
నాకోసం ఒక అడుగు వేసిండ్రు..మీ సంక్షేమం కోసం ఎంత దూరమైనా వెళ్తా
దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్ రెడ్డి
చిన్న చింతకుంట: ప్రజల సంక్షేమాన్ని మరిచి గత ప్రభుత్వము అప్పులు చేసి ఇష్టానుసారంగా ఖర్చు చేసిపోతే వారు చేసిన అప్పులకు మనం వడ్డీలు చెల్లిస్తున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. మండలం పరిధిలోని పెద్ద వడ్డేమాన్ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి శ్రీకరం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... నాకోసం ఒక అడుగు మీరు వేశారని మీ సంక్షేమం కోసం ఎన్ని అడుగులైనా ఎంత దూరమైనా వెళ్లేందుకు సహాయ శక్తులుగా కృషి చేస్తానని అన్నారు.
వాస్తవాలను ప్రజలకు అవగతం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని, ఇచ్చిన మాట మేరకు సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. దేశ చరిత్రలో ఎక్కడ ఎవరు కూడా పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం ఇవ్వడం లేదని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడ 15 నెలల లోనే పెద్ద వడ్డేమాన్ గ్రామంలో రూ 69 లక్షలతో అభివృద్ధి పనులు చేశామని, త్వరలో ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతునామన్నారు.
గ్రామంలో ఇంటి జాగా లేనివారికి ప్రభుత్వ స్థలంలో ఇంటి స్థలం కేటాయిస్తామని, గత ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో వడ్డేమాన్ లో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని విమర్శించారు. మీరు పెట్టుకున్న నమ్మకం రెట్టింపు అయ్యేలా ప్రజాపాలన ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. అనంతరం చిన్న చింత కుంట మండల పరిధిలోని పర్దిపూర్, పల్లమర్రి, లాలకోట గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతులకు పూర్తిస్థాయిలో భరోసా కల్పిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.