మహబూబ్ నగర్,(విజయక్రాంతి): మత్స్యకారులకు మునుముందు మరింత మంచి రోజులు ఉన్నాయని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అన్నారు. సోమవారం కోయిల్ సాగర్ ప్రాజెక్ట్, దేవరకద్ర పెద్ద చెరువులో ఉచితంగా చేప పిల్లలను వదిలారు. ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ... నియోజకవర్గంలో ఇప్పటి వరకు 39 లక్షల చేప పిల్లలను ప్రభుత్వం ఉచితంగా మత్స్య శాఖ ఆధ్వర్యంలో అందజేశామని తెలిపారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకుంటూ ఇచ్చి హామీలను నెరవేరుస్తుందన్నారు. త్వరలోనే అజీలపూర్ లిఫ్ట్, చౌదర్ పల్లి లిఫ్ట్ లను పూర్తి చేసి రైతాంగానికి నీరందిస్తామని వెల్లడించారు. కోయిల్ సాగర్ ఆయకట్టు కింద రైతాంగానికి రెండో పంటకు నీరందిస్తామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం ప్రభుత్వం శాయశక్తుల కృషి చేస్తుందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలబడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు