కూకట్ పల్లి (విజయక్రాంతి): సామాన్య ప్రజల సొంతింటి కలను నిజం చేయడం కోసం ఏర్పడ్డ హౌసింగ్ బోర్డు ఫక్తు రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థగా మారి మోసపూరితంగా భూములును అమ్మడం పట్ల ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram Krishna Rao) తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ మండలి (TSHB) మోసపూరిత వైఖరిని ఎండగడుతూ రోడ్డులో పోతున్న ప్లాట్ల వేలం ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ వేలం పాటను అడ్డుకుంటామని ప్రకటించిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో పాటు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, ముఖ్యనాయకులను పోలీసులు శుక్రవారం హౌస్ అరెస్ట్ చేశారు. ఉదయం ఆరుగంటల నుంచి పెద్దయెత్తున పోలీసులను మోహరించి ఎక్కడిక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. అయినప్పటికీ వందలాదిగా నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నివాసానికి తరలివచ్చారు.
దీంతో పోలీసులు ఇంటికి నలువైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి నాయకులు కార్యకర్తలను నియంత్రించేందుకు ప్రయత్నించారు. కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నలుగురు ఇన్స్పెక్టర్లు నాలుగు పోలీసుస్టేషన్ల సిబ్బందిని మొహరించి వేలం పాటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ... కూకట్పల్లి నియోజకవర్గంలో సామాన్య ప్రజలు హౌసింగ్ బోర్డు చేతిలో మోసపోవద్దని సూచించారు. ఏకంగా హుడా మాస్టర్ ప్లాన్ లో 100 ఫీట్లు రోడ్డుగా చూపిన కెపిహెచ్బి 15వ ఫేస్ లోని ఖాళీ స్థలాలను, 200 ఫీట్ల రోడ్డుగా చూపిన 7వ ఫేస్ లోని ఖాళీ స్థలాలను మోసపూరితంగా 80 అడుగుల రోడ్డుగా చూపుతూ రోడ్డు స్థలాలను అమ్మకానికి పెట్టడం హౌసింగ్ బోర్డు అధికారుల నీతి మాలిన చర్యకు నిదర్శనమన్నారు. గడిచిన ఐదు రోజులుగా రోడ్డు స్థలాలను వేలం వేయొద్దని, సామాన్య ప్రజలను మోసం చేయొద్దని హౌసింగ్ బోర్డు అధికారులను కోరినప్పటికీ పట్టించుకోకపోవడంతో వేలాన్ని అడ్డుకుంటామని ప్రకటించినట్లు తెలిపారు.
80 ఫీట్ల రోడ్డుగా నమ్మించి అమ్ముతున్న ఖాళీ స్థలాలను కొనుగోలు చేసిన వారు రోడ్డు విస్తరణతో ప్లాట్లను కోల్పోతారని అప్పుడు జిహెచ్ఎంసి ద్వారా నష్టపరిహారం ఇప్పించాలని రోడ్డు ఎక్కుతారని ఇవన్నీ ముందస్తుగా గ్రహించి హౌసింగ్ బోర్డు అధికారులు రోడ్డులో పోయే ప్లాట్లను వేలం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా జీవో నంబర్ 6 ప్రకారం వందగజాలలోపు స్థలాల్ని పక్క ఇంటివారికి లేదా పక్కనే ఉన్న ప్లాట్ల యజమానులకు మార్కెట్ వాల్యూ ప్రకారం కేటాయించాల్సి ఉన్నప్పటికీ వేలానికి పెట్టడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ భూములను అమ్మితే అన్ని సక్రమంగా ఉంటాయని సామాన్య ప్రజలు నమ్మకంతో కొంటారని అయితే హౌసింగ్ బోర్డు అధికారులు మాత్రం ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యయుతంగా నిబంధనల మేరకు హౌసింగ్ బోర్డు స్థలాల వేలంలో పాల్గొనేందుకు బ్యాంకు ద్వారా డిడి తీసుకునప్పటికీ అనుమతించకపోవడం దుర్మార్గమన్నారు.