ఇల్లెందు,(విజయక్రాంతి): అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండలంలో గురువారం జరిగిన గ్రామసభల్లో ఎమ్మెల్యే కోరం పాల్గొన్నారు. మండలంలోని తొమ్మిదవ మైల్ తండా, బోడు, రామచంద్రుని పేట పంచాయతీలో జరిగిన గ్రామసభల్లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26న ఇచ్చే నాలుగు పథకాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను ఇప్పటికే గుర్తించారని, వాటిలో పేర్లు రానివారు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే విచారణ చేసి ఎంపిక చేస్తారని తెలిపారు. జాబితాలో పేర్లు లేవన్న ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ గణేష్ గాంధీ, డిప్యూటీ తాసిల్దార్ ముత్తయ్య, కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.