08-04-2025 03:12:34 PM
11.5 కిలోమీటర్ల మేర బ్రాహ్మణ వెల్లంల లెఫ్ట్ మెయిన్ కెనాల్ విస్తరణ
బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ఇంజనీర్లతో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సమీక్ష
మునుగోడు,(విజయక్రాంతి): బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నుండి మునుగోడు మండలంలో 25 వేల ఎకరాల విస్తీర్ణానికి నీరు అందించి మునుగోడును సస్యశ్యామలను చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని తన నివాసంలో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నుండి మునుగోడు మండలంలోని భూములను సస్యశ్యామలం చేసే ఉరుమడ్ల గ్రామం వరకే ఉన్న బ్రాహ్మణ వెల్లంల లెఫ్ట్ మెయిన్ కెనాల్ ను కిష్టాపురం గ్రామం వరకు 11.5 కిలోమీటర్ల మేర విస్తరించి వీలైనంత ఆయకట్టుకు నీటిని అందించే విధంగా ప్రపోజల్సు రెడీ చేసి పనులు మొదలుపెట్టాలన్నారు. భవిష్యత్తులో అవసరం అయితే కిష్టాపురం చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా మార్చుకొని అక్కడినుండి ఎగువ ప్రాంతానికి లిఫ్ట్ ల ద్వార నీరందించాలన్నారు. కిష్టాపురం వరకు వచ్చే మెయిన్ కెనాల్ తో పాటు కిష్టాపురం తర్వాత ఎంతవరకు వెసులుబాటు ఉంటే అంతవరకు డిస్ట్రిబ్యూషన్ కాలువలు తవ్వడానికి కావలసిన సర్వే, భూసేకరణ పనులు వెంటనే మొదలు పెట్టాలన్నారు. బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టులో సరిపడా నీరు ఉండేలా పానగల్లు ఉదయ సముద్రం నుండి నీటిని తీసుకొని వచ్చే వానకాలం పంటలకు రెడీగా ఉండాలని అన్నారు. ఎస్ఎల్బీసి టన్నెల్ పనులు పూర్తయిన తర్వాత కృష్ణా నీటిని సమృద్ధిగా వాడుకోవడానికి పానగల్లు ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెళ్లెంల ప్రాజెక్టు కెపాసిటీ పెంచుకోవాల్సి ఉంటుందన్నారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నుండి మునుగోడు మండలంలో ఆయకట్టును సాధ్యమైనంతవరకు పెంచే విధంగా పనులు వెంటనే మొదలు పెట్టాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఈఈ శ్రీనివాస్ రెడ్డి, డిఈ విటలేశ్వర్, ఏఈఈ నవీన్ కుమార్ ఉన్నారు.