calender_icon.png 22 December, 2024 | 1:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ రాజ్యంలో ఎమ్మెల్యేకు రక్షణ లేదు

13-09-2024 03:30:00 AM

  1. పోరాడుతున్నందుకే కౌశిక్ రెడ్డి టార్గెట్  
  2. బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం వెనక సీఎం రేవంత్‌రెడ్డి హస్తం ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. గురువారం ఒక ప్రకటనలో పేర్కొంటూ పట్టపగలే ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి హత్యాయత్నా నికి ప్రయత్నిస్తున్నారంటే రాష్ర్టంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డిని గృహ నిర్భంధంలో ఉంచి పోలీసుల సాయంతో అరికెపూడి గాంధీ గుండాలు రెచ్చిపోయి దాడులకు పాల్పడటమేమిటన్నారు. 

పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై న్యాయపోరాటం చేస్తున్న కౌశిక్ రెడ్డిని   ప్రభుత్వం టార్గెట్ చేసిందన్నారు. కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర చేస్తున్నారని, ఆయనకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. గాంధీ ఇంటికి వెళ్తానన్న కౌశిక్‌రెడ్డిని గృహ నిర్భంధంలో ఉంచిన పోలీసులు, అరికెపూడిని మాత్రం కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చేందుకు ఎలా అనుమతించారని ప్రశ్నించారు.  ఇలాంటి చిల్లర చేష్టలకు పాల్పడుతున్న రేవంత్ రెడ్డిని చూస్తుంటే జాలేస్తోందన్నారు. అక్రమ కేసులు, దాడులతో బెదిరించాలని ప్రయత్నిస్తే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదన్నారు. ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేపై ప్రభుత్వమే దాడి చేయించటమా అని ప్రశ్నించారు. 

కౌశిక్‌రెడ్డిపై దాడి హేయం: వేముల  

కౌశిక్ రెడ్డి ఇంటిపై అరికెపూడి గాంధీ తన వందలాది మంది అనుచరులతో దాడి చేయడం హేయమైన చర్య అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శాంతి భద్రతలు కాపాడటంలో ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారని మండిపడ్డారు.   కాంగ్రెస్ తెలంగాణలో  రౌడీ రాజ్యం తేవాలనుకుంటుందని మండిపడ్డారు. కౌశిక్‌రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని దేవీప్రసాద్ పేర్కొన్నారు. పోలీసులు రెడ్ కార్పెట్ వేసి దాడికి సహకరించడం దుర్మార్గమన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలు కరువయ్యాయి, ఎమ్మెల్యేపై దాడిని ప్రతిపక్షాలపై ప్రభుత్వ దాడిగా భావిస్తున్నామని తెలిపారు.

పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై అరికెపూడి గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ గుండాల దాడి ముమ్మాటికీ హత్యాయత్నమేనని రాష్ట్ర కల్లు గీత కార్పోరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ మండిపడ్డారు. ప్రశ్నించే వారిపై భౌతిక దాడులకు పాల్పడుతూ రేవంత్ రెడ్డి రౌడీ రాజ్యం నడిపిస్తున్నారని విమర్శించారు.   సీఎం రేవంత్‌రెడ్డి మద్దతుతోనే కౌశిక్‌రెడ్డిపై దాడి జరిగిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.  అరికపూడి కండువా కప్పుకుని కాంగ్రెస్ పార్టీలో చేరాడని, పదవి కోసం నాటకాలు ఆడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.