సిద్దిపేట,(విజయక్రాంతి): అకాల వర్షానికి చాలాచోట్ల వడ్లు తడిసిపోయాయని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా బద్దిపడగలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే హరీశ్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ధన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు కానీ.. వడ్లు కొనేవారు లేరు అని ఆయన వివర్శించారు. రైతుల పరిస్థితి గాలిలో దీపం పెట్టి దేవుడా నీవే దిక్కు అన్నట్లు అయిపోయిందన్నారు.
సోయాబీన్ రైతులకు 2 నెలలుగా డబ్బులు చెల్లించలేదని హరీశ్ రావు మండిపట్టారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు రెండు సీజన్ల రైతుబంధు వేయలేదని దుయ్యబట్టారు. గతంలో బీఆర్ఎస్ హాయంలో ప్రభుత్వానికి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు రైతుబంధును మాత్రం ఆపలేదని గుర్తు చేశారు. రైతులకు మేలు చేసే రైతుబీమా లేకుండా చేశారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.