హైదరాబాద్,(విజయక్రాంతి): కౌశిక్ రెడ్డిపై దాడి జరిగినప్పుడు డీజీపీ ఎందుకు స్పందించలేదు..? అని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్ధిపేట్ ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతులు ఉన్నాయా..? అని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై రాళ్లదాడి చేసిన వారికి రాచమర్యాదలు చేశారని, దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన మమ్మల్ని అరెస్టు చేస్తారా..? అంటూ హరీశ్ రావు పోలీసులపై దుయ్యాబట్టారు.
ఖమ్మం, సిద్దపేటలో మాపై దాడి జరిగినప్పుడు పోలీసులు ఎక్కడున్నారు..?, ఇప్పుడు బీఆర్ఎస్ నేతలపై దాడులు జరిగితే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోరు.. ? అని ఎమ్మెల్యే ఆగ్రహించారు. కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడికి సీఎం రేవంత్ రెడ్డే కారణం అని హరీశ్ రావు ఆరోపించారు. ముఖ్యమంత్రే రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని, సీఎంను చూసే మిగిలిన నేతలు నేర్చుకుంటున్నారని ఆయన చెప్పారు. గాంధీని నిన్నే హౌస్ అరెస్టు చేసి ఉంటే కౌశిక్ రెడ్డిపై దాడి జరిగేది కాదని హరీశ్ రావు తెలిపారు.