calender_icon.png 23 September, 2024 | 5:45 PM

రాష్ట్రంలో ప్రజాపాలన కాదు.. గుండా రాజ్యం నడుస్తుంది..

23-09-2024 03:35:36 PM

మెదక్: మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి ఇంటిపై ఆదివారం అర్ధరాత్రి కాంగ్రెస్ గూండాలు దాడికి పాల్పడిన ఘటనపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. సోమవారం ఆయన సునీత రెడ్డి ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గూండా రాజ్యం నడిపిస్తుంది. ప్రజల హక్కులు కాలరాసేలా సాక్షం రాజకీయాలకు తెర లేపుతుందన్నారు.

 సీఎం రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే మాటల వల్లే కాంగ్రెస్ నాయకులు గూండాల్లా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి ఇంటిపై దాడి ఉద్దేశపూర్వకంగానే జరిగిందని మండిపడ్డారు. అర్ధరాత్రి ఎమ్మెల్యే ఇంటిముందు టపాకాయలు కాలుస్తూ ఇంట్లోకి చొరబడి దాడులకు పాల్పడడం దారుణమైన విషయం అన్నారు. తాను జిల్లా ఎస్పీ, ఐజితో మాట్లాడాలని, వెంటనే కాంగ్రెస్ గూండాలపై పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మా హయాంలో  తెలంగాణ పోలీసులు అద్భుతంగా పని చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అభాసుపాలవుతున్నారని విమర్శించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫిర్యాదు చేసిన 24 గంటల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసేవారని, సాక్షాత్తు ఎమ్మెల్యే ఇంటి పైనే దాడి జరిగితే ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిని వదిలి పెట్టమని అవసరమైతే హ్యూమన్ రైట్స్ కమిషన్కు, కోర్టుకు సైతం వెళ్తామని హెచ్చరించారు. మా ఓపికను పరీక్షించొద్దని.. సాక్ష్యం రాష్ట్రంగా మార్చవద్దని  సూచించారు. గోమారం దాడి విషయంలో తెలంగాణ డిజిపి వెంటనే స్పందించి ఉన్నత స్థాయి విచారణ జరిపి కాంగ్రెస్ గూండాలపై నాన్ బేలబుల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.