చేవెళ్ల: రోడ్డు ప్రమాదంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య గన్ మెన్ మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. శంకర్ పల్లి మండలం బుల్కాపూర్ గ్రామానికి చెందిన ముతంగి శ్రీనివాస్(28) వికారాబాద్ జిల్లా ఏఆర్ కానిస్టేబుల్. ఇతను గత నాలుగేళ్లుగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యకు గన్ మెన్ గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి బైక్ పై శంకర్ పల్లి మండలం కొండగల్ గ్రామం నుంచి వెలిమల వైపు వెళ్తున్నాడు. వెలిమెల తండా శివారులోకి వెళ్లగానే ఆకస్మాతుగా అడవి పంది రోడ్డుపైకి రావడంతో బైక్ అదుపు తప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న బీడీఎల్ భానూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్ చెరు ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.
మృతుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే యాదయ్య సోమవారం పటాన్ చెరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి శ్రీనివాస్ మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం అతని కుటుంబ సభ్యులను పరామర్శించి.. రూ.50 వేల ఆర్థిక సాయం అందజేశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ... శ్రీనివాస్ తన దగ్గర నాలుగేళ్లుగా పనిచేస్తున్నాడని, అతను చనిపోవడం తీవ్ర దిగ్ర్బాంతిని కలిగించిందన్నారు. ఎప్పుడూ సమయ పాలన పాటించే వాడని, అందరితో సన్నిహితంగా మెలిగే వాడని గుర్తు చేసుకున్నాడు