calender_icon.png 9 January, 2025 | 10:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు

08-01-2025 03:03:02 PM

జనవరి 20వ తేదీ లోపు నూతన రిజర్వాయర్ల ద్వారా నీటి సరఫరా ప్రారంభం

వచ్చే వేసవికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయండి 

తెల్లాపూర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిధిలో నీటి ఎద్దడి నివారణకు ప్రణాళిక

పటాన్ చెరు,(విజయక్రాంతి): బొల్లారం, అమీన్ పూర్  మున్సిపల్ పరిధిలో నిర్మించిన నూతన రిజర్వాయర్ల ద్వారా ఈనెల 20వ తేదీ లోపు ప్రతి ఇంటికి మంచినీటిని సరఫరా చేస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) తెలిపారు.  బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జలమండలి అధికారులు, మున్సిపల్ చైర్మన్ లు, మున్సిపల్ కమిషనర్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పటాన్ చెరు నియోజకవర్గంలోని ఓఆర్ఆర్ పరిధిలోగల మున్సిపాలిటీలలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతన రిజర్వాయర్లు నిర్మించడంతోపాటు పైప్ లైన్లు వేయడం జరుగుతుందని తెలిపారు.

ప్రధానంగా బొల్లారం మున్సిపల్ పరిధిలో రెండు మిలియన్ లీటర్ల సామర్థం గల రెండు రిజర్వాయర్లు, పంప్ హౌస్ పనులు పూర్తయ్యాయని త్వరలో మంచినీటి సరఫరా జరుగుతుందని  తెలిపారు. అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని పటేల్ గూడ,  లాలాబావి కాలనీ, బంధం కొమ్ములో మూడు రిజర్వాయర్లు పూర్తయ్యాయని, 20వ తేదీ లోపు మంచినీటి సరఫరా ప్రారంభమవుతుందన్నారు. బొల్లారం పారిశ్రామికవాడలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం జరిగిందన్నారు. ఓఆర్ఆర్ అవతల బొల్లారం మున్సిపల్ పరిధిలోని నూతన గృహాలకు, అపార్ట్మెంట్ లకు సైతం మంచినీరు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

అమీన్ పూర్, తెల్లాపూర్, బొల్లారం మున్సిపల్ పరిధిలో అసంపూర్తి పనులు పూర్తి చేసేందుకు మున్సిపాలిటీల నుండి రూ.5.40 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో కొల్లూరు, ఉస్మాన్ నగర్ లో  నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఇప్పటికే 15,000 మంది లబ్ధిదారులు నివసిస్తున్నారని, ఇందుకు అనుగుణంగా సమస్యలు లేకుండా మంచినీటిని అందించాలని అధికారులను ఆదేశించారు. నూతన రిజర్వాయర్ల ఏర్పాటుకు స్థలాలను ఎంపిక చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. రాబోయే వేసవిలో మంచినీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. నీటి ఎద్దడి పేరుతో ప్రజల నుండి ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.