calender_icon.png 24 October, 2024 | 11:50 PM

బీఆర్‌ఎస్‌కు రికార్డు మెజార్టీ అందించాలి

05-05-2024 12:54:32 AM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

పటాన్‌చెరు, మే 4 : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీని ఆదరించి రికార్డు స్థాయి మెజారిటీని అందించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కోరారు. బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వేదిరి టౌన్‌షిప్, హెచ్‌ఎంటీ కాలనీ, పీజేఆర్ ఎన్‌క్లేవ్, సాయి అంబిక కాలనీ, శ్రీవాణినగర్, జన్మభూమి ఫేజ్ కాలనీల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పర్యటించి ఆయా సంక్షేమ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పది సంవత్సరాలలో పటాన్‌చెరు నియోజకవర్గాన్ని 900కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. మున్సిపల్  వ్యాప్తంగా రూ.110కోట్లతో  ఐదు రిజర్వాయర్లు నిర్మించి ఇంటింటికి తాగునీటిని అందించామని గుర్తు చేశారు. అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నర్సింహగౌడ్, కౌన్సిలర్లు చంద్రకళగోపాల్, బిజిలిరాజు, మహదేవరెడ్డి, రాజేశ్వరి, సీనియర్ నాయకులు రాములు, రుశ్వంత్‌రెడ్డి, చంద్రశేఖర్ పాల్గొన్నారు. 

పాస్టర్ల సంక్షేమానికి కృషి

నియోజకర్గంలోని చర్చి పాస్టర్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే అన్నారు. శనివారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి చర్చి పాస్టర్ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో మతసామరస్యాన్ని పెంపొందిస్తున్నామన్నారు. పది ఏండ్లలో సొంత ఖర్చుతో రూ. 20కి పైగా చర్చిలు నిర్మించడంతో పాటు క్రైస్తవుల కోసం ఐదు ఎకరాల స్థలాన్ని శ్మశాన వాటిక కోసం కేటాయించినట్లు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి విజయానికి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్పనగేశ్, మాజీ జడ్పీటీసీ కొలను బాల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్, ఏఎంసీ మాజీ చైర్మన్ విజయ్‌కుమార్, సీనియర్ నాయకులు దశరథరెడ్డి, వెంకట్‌రెడ్డి, హనుమంత్‌రెడ్డి పాల్గొన్నారు.