పటాన్‌చెరులో ఘనంగా ప్రారంభమైన 35వ మైత్రి క్రికెట్ కప్ పోటీలు
పటాన్‌చెరు, జనవరి 19 : క్రీడలకు సంపూర్ణ సహకారం అందిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. నేటి యువత క్రీడలపై ఆసక్తి పెంపొందించు కోవాలని, క్రికెట్ అభివృద్ధికి మైత్రి క్రికెట్ క్లబ్ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో మైత్రి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 35వ మైత్రి క్రికెట్ ట్రోఫీని ఆదివారం ఉదయం ఎమ్మెల్యే లాంచనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాల చరిత్ర కలిగిన మైత్రి మైదానాన్ని క్రీడారంగానికి కేంద్రంగా తీర్చిదిద్దామని తెలిపారు. రెండేండ్ల క్రితం రూ. 7.50 కోట్లతో ఆధునిక వసతులతో మైదానాన్ని తీర్చిదిద్దామని తెలిపారు. గత 35 సంవత్సరాలుగా ప్రతి ఏటా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న ఘనత మైత్రి క్రికెట్ క్లబ్ కి దక్కిందని తెలిపారు.
పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంత రెడ్డి, పారిశ్రామికవేత్తలు కే. సత్యనారాయణరెడ్డి, సి. సత్యనారాయణ రెడ్డి, సిఐ వినాయక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహ రెడ్డి, అఫ్జల్, క్రీడాకారులు పాల్గొన్నారు.