21-04-2025 05:44:52 PM
వెలుగు గురుకుల పాఠశాలలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గండ్ర
చిట్యాల,(విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.సోమవారం చిట్యాల మండలకేంద్రంలోని వెలుగు బాలికల గురుకుల పాఠశాలలో రిటైర్డ్ డీడబ్ల్యూఓ చిన్నయ్య బహుకరించిన అంబేద్కర్ విగ్రహాన్ని పాఠశాల ప్రిన్సిపల్ గోల్కొండ బిక్షపతి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం రిటైర్డ్ డీడబ్ల్యూఓ చిన్నయ్యను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... విద్యార్థుల అంబేద్కర్ జీవితాన్ని ఆశయంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులకు అంబేద్కర్ జీవితాన్ని స్పష్టంగా అర్థం అయ్యేవిధంగా చెప్పాలన్నారు.
బడుగు బలహీన వర్గాల కోసం అంబేద్కర్ పోరాటాలు చేశారని, విద్య ద్వారానే హక్కులను సాధించుకోవచ్చని చెప్పారని గుర్తు చేశారు. వెలుగు బాలికల పాఠశాలలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వెలుగు పాఠశాల ప్రిన్సిపాల్ గోల్కొండ బిక్షపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ముఖిరాల మధువంశీ కృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి, అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య, టౌన్ అధ్యక్షుడు బుర్ర లక్ష్మణ్ గౌడ్, మాజీ ఎంపీటీసీ దబ్బేట అనిల్, చిలుకల రాయకోమురు, అంబేద్కర్ వాదులు పుల్ల మల్లయ్య, జన్నె యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.