నిజామాబాద,(విజయక్రాంతి): అనారోగ్యంతో బాధపడుతున్న వారికి 50 శాతం సీఎం రిలీఫ్ ఫండ్ కింద చికిత్స డబ్బులు చెల్లించాలని ముఖ్యమంత్రి కోరినట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. సీఎం సహాయనిధి ద్వారా 132 మంది లబ్ధిదారులకు రూ.30,50,600 సీఎం ఆర్ ఎఫ్ చెక్కులను పంపిణీ చేసినట్టు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు.
సుభాష్ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ చెక్కుల పంపిణీ ఆయన చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ... బాధితుల నుండి వస్తున్న దరఖాస్తులు పరిశీలించి ఎటువంటి జాప్యం లేకుండా సీఎం సహాయనిధికి వెంటనే పంపడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం చెక్కుల జారీ విషయంలో కొంత జాప్యం కారణంగా బాధితులు దరఖాస్తు చేసుకున్న మొత్తంలో 15% నుండి 20% వరకే చెల్లిస్తున్నామన్నారు.
పేద మధ్య తరగతి బాధిత కుటుంబాలకు చికిత్స ఖర్చు ఆర్థిక భారంగా మారుతోందన్నారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారిని నేరుగా కలిసి ఉన్న సమయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల జాప్యం దరఖాస్తు చేసుకున్న మొత్తంలో 50 శాతం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డిని కోరినట్టు ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన విద్య వైద్యం అందించడమే మొదటి లక్ష్యం అని రాబోయే రోజుల్లో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని అధునాత సౌకర్యాలతో నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.