calender_icon.png 12 January, 2025 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూమిని కాజేసేందుకు ఎమ్మెల్యే కుట్ర!

12-01-2025 12:02:56 AM

  • సూర్యాపేటలో కోట్లాది రూపాయల భూమి కబ్జాకు యత్నం
  • ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రామచంద్రనాయక్‌పై ఆరోపణ

సూర్యాపేట, జనవరి 11: నకిలీ పాస్‌బుక్‌తో డాక్యుమెంట్లను సృష్టించి తన భూమిని కబ్జా చేసేందుకు ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచందర్‌నాయక్ యత్నిస్తున్నాడని సూర్యాపేటకు చెందిన గుండపనేని సుధాకర్‌రావు ఆరోపణలు చేస్తున్నాడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల 60 ఫీట్ల రహదారికి పక్కన 50 గుంటల భూమిని 1990లో సుధాకర్‌రావు కొన్నాడు. ఆ భూమిని 2010లో విశ్రాంత తహసీల్దార్ సుందర్ జారీ చేసిన నకిలీ పాస్‌బుక్‌తో డాక్యుమెంటేషన్ చేయించుకుని ఎమ్మెల్యే రాంచందర్‌నాయక్ తన భూమిని ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నాడని తెలిపాడు.

ఇదే విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా సదరు పాస్‌బుక్‌ను రద్దు చేస్తూ నాటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ ఎస్‌ఏఎం రిజ్వీ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ఉత్తర్వులు జారీ చేశాడన్నారు. 2016లో రాంచందర్‌నాయక్ తమ భూమిపైకి రాగా ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని సుధాకర్‌రావు ఆరోపించారు.

ఈ భూమికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్‌లు తమ వద్ద ఉన్నాయని, వీటినే ఆధారంగా చేసుకుని తన కుమార్తె ఉన్నత చదువుల కోసం రుణాన్ని కూడా తీసుకున్నానని చెప్పాడు. భూమి కోసం వారం రోజులుగా తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపాడు. రాంచందర్‌నాయక్‌పై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలను వేడుకున్నాడు.