08-04-2025 08:43:02 PM
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల 17వ వార్షికోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు మదన్ మోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ... విద్యార్థులు విజ్ఞానంతో పాటు నైతికతను అలవర్చుకోవాలని, సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. కళాశాల అభివృద్ధి కోసం తాను పూర్తి స్థాయిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రంలో ప్రత్యేక అథితులుగా ఎల్లారెడ్డి RDO ప్రభాకర్, DSP శ్రీనివాస్ రావు, ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రామ్ రెడ్డి, కాలేజీ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.