19-04-2025 04:33:23 PM
దేవరకొండ: చందంపేట మండలంలోని పోలేపల్లి గ్రామంలో నల్గొండ జిల్లా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్(SP Sharat Chandra Pawar) తో కలిసి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు(MLA Nenavath Balu Naik) నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... శాంతి భద్రతల పరిరక్షణతో పాటు సమాజ సేవలో పోలీసులు ముందుంటారని వారు అన్నారు. మారుమూల గ్రామాల్లోని గిరిజనులు అనారోగ్యం, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని గుర్తించి పోలీసు శాఖ తరుపున వైద్య శిబిరం ఏర్పాటు చేసినందుకు పోలీస్ శాఖను వారు అభినందించారు.
గిరిజనులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ముఖ్యంగా మహిళలు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని తెలిపారు. అన్ని రకాల స్పెషలిస్టు వైద్యులతో వైద్య శిబిరాన్ని పోలీస్ శాఖ వారు నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రజల రక్షణకే పోలీసులు పని చేస్తున్నారని చెప్పారు. అనంతరం వైద్య శిబిరంలో వైద్యులు చేస్తున్న పరీక్షలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో దేవరకొండ అడిషనల్ ఎస్పీ మౌనిక, ప్రభుత్వ డాక్టర్లు, పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.