- టోర్నీలో బెస్ట్ ఇవ్వాలనుకున్నా.. ఇచ్చా
- శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం
రాజేంద్రనగర్, ఫిబ్రవరి4: ఇటీవలే మలేషియాలో జరిగిన మహిళల అండర్ ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన తెలంగాణ ముద్దుబిడ్డ గొంగడి త్రిషకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. మంగళవారం తెల్లవారుజామున మరో క్రీడాకారిణి ధ్రుతి కేసరితో కలిసి త్రిష హైదరాబాద్‌లో అడుగుపెట్టింది.
ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో త్రిషకు కుటుంబసభ్యులు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఘన స్వాగతం పలికింది. ఈ సందర్భంగా త్రిష మీడియాతో మాట్లాడుతూ.. ‘చాలా సంతోషంగా ఫీలవుతున్నా. టోర్నీలో 309 పరుగులు సాధించి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’గా నిలవడం సంతోషం కలిగించింది.
సీనియర్లు ఎక్కువగా ఉండడంతో గత టోర్నీలో తనకు పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే ఈసారి టోర్నీలో మాత్రం దానిని సద్వినియోగం చేసుకొని బెస్ట్ ఇవ్వాలనుకున్నా.. అదే ఇచ్చాను. జట్టులో తనకు మంచి సపోర్ట్ దక్కింది. అండర్ టీ20 ప్రపంచకప్‌లో తొలి సెంచరీ కొట్టడం ఆనందంగా అనిపించింది.
ఆ సమయంలో మా నాన్న స్టేడియంలో ఉండడం గర్వంగా అనిపించింది. మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ నాకు స్పూర్తి. కష్టానికి తగిన ఫ్రతిఫలం దక్కడంతో హ్యాపీగా ఉన్నా.
మరింత కఠోర శ్రమతో సీనియర్ జట్టులో స్థానం దక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నా’ అని తెలిపింది. కాగా క్రికెట్‌లో అడుగుపెట్టడం వెనుక తన తండ్రి, కుటుంబసభ్యుల ప్రోత్సాహం ఎంతగానో ఉందంటూ త్రిష భావోద్వేగానికి గురయ్యింది.