24-03-2025 12:00:00 AM
నారాయణఖేడ్, మార్చి 23: గత ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి. సంజీవరెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సాగు లేని భూములకు సైతం రైతుబంధు ఇవ్వడం వల్ల కోట్లల్లో ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయిందన్నారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎకరాకు రూ. 6 వేల చొప్పున రైతుబంధు ఇవ్వడం జరిగిందన్నారు. రైతులకు సబ్సిడీ ద్వారా వ్యవసాయ పరికరాలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక పథకం తీసుకువచ్చిందని పేర్కొన్నారు. అర్హత కలిగిన రైతులు సబ్సిడీ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సబ్సిడీ పరికరాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం ఉంటుందని పేర్కొన్నారు.
త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అందిస్తామని పేర్కొన్నారు. ఉగాది నుండి తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం అందిస్తామని అన్నారు. రాజీవ్ యువ వికాస్ ద్వారా నిరుద్యోగులకు మూడు లక్షల రుణాలు అందించడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం పేరు చెప్పి ఇప్పటికి గ్రామాలకు పూర్తిస్థాయిలో తాగునీరు అందించలేదని పాత పథకాలకి రంగులు వేసి మిషన్ భగీరథ అని పేరు చెప్పి నిధులు కాజెశారని ఆరోపించారు.
నల్ల వాగు ద్వారా సాగులో ఉన్న 3 ఎకరాల భూమికి సాగునీరు అందించాల్సి ఉండగా తాము అయిదు వేల ఎకరాల మేర సాగునీరు అందించేందుకు తగు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. భూగర్భ జలాలు తగ్గుతున్నందున రైతులు పరిస్థితిలను బట్టి పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ఈనెల 27న అధికారికంగా ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
రంజాన్ మాసాన్ని ముస్లిం సోదరులు ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. పి ఆర్ టి యు రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన గుండు లక్ష్మన్ను ఘనంగా సన్మానించారు. నారాయణఖేడ్ ప్రాంతం నుండి రాష్ట్ర స్థాయికి ఎదగడం హర్షనీయమని పేర్కొన్నారు. సమావేశంలో మైనార్టీ నాయకులు తాహెర్ అలీ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శంకర్ సెట్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ చౌహన్, తదితరులు పాల్గొన్నారు.