calender_icon.png 17 April, 2025 | 8:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిషన్ మధుమేహ, వందరోజుల టిబీ సర్వేలు విజయవంతం

16-04-2025 12:00:00 AM

వనపర్తి టౌన్, ఏప్రిల్ 15 : జిల్లాలో మిషన్ మధుమేహ, వందరోజుల టిబీ సర్వే కార్యక్రమాలు విజయవంతం చేయడంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది అద్భుతంగా పనిచేశారని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రశంసించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మిషన్ మధుమేహ కార్యక్రమంలో భాగంగా అత్యుత్తమ పనితీరు కనబరిచిన అధికారులు, సిబ్బందికి అభినందన సభ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మిషన్ మధుమేహ, వందరోజుల టిబి సర్వే కార్యక్రమాలు విజయవంతం చేయడంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ వైద్య శాఖకు అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో  అహర్నిశలు శ్రమించిన ఏఎన్‌ఎం లకి,  స్టాఫ్ నర్స్ లకి, ఆశా వర్కర్స్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

వారు చేసిన కృషి చాలా గర్వపడే విషయమని కొనియాడారు. జిల్లాలో 30 ఏళ్లు పైబడిన వారికి 3,09,643 మందికి మిషన్ మధుమేహ లో భాగంగా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ పరీక్షల్లో 19500 మందికి డయాబెటిస్ ఉన్నట్లు గుర్తించినట్లు, వారిలో 3,000 మంది కొత్తగా డయాబెటిస్ బారిన పడిన వారు ఉన్నారని గుర్తించడం జరిగిందన్నారు.

డయాబెటిస్ గుర్తించిన వారందరికీ మందులతో పాటు, జీవనశైలిలో మార్పులను సూచించడం జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా గత ఆరు నెలల్లో వైద్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాల్లో అత్యుత్తమంగా పనిచేసిన వారికి అవార్డులు ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా వైద్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మిషన్ మధుమేహ కార్యక్రమంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన అధికారులు, సిబ్బందికి కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ శ్రీనివాసులు, డబ్ల్యూహెచ్‌ఓ కన్సల్టెంట్ అబ్దుల్ వాసే, ఎన్సిడి ప్రోగ్రాం అధికారి రామచంద్రరావు, టీబీ సర్వే ప్రోగ్రామ్ అధికారి సాయినాథ్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.