19-03-2025 12:00:00 AM
కామారెడ్డి, మార్చి 18(విజయక్రాంతి): ప్రభుత్వ మెడికల్ కళాశాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్‌లో మిషన్ భగీరథ, మెడికల్ కళాశాల అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కామారెడ్డి పట్టణం లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు శాశ్వత ప్రాతిపదికన మిషన్ భగీరథ నీటిని సరఫరా చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, కళాశాలకు అవసరమైన నీటి సరఫరాకు ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు.
ఈ వేసవి కాలంలో ప్రస్తుతం అద్దెలో భవనాల్లో నడుస్తున్న హాస్టల్ లలో నీటిని ట్యాంకర్ల ద్వారా నీటినిసరఫరా చేయాలని మున్సిపల్ కమీషనర్ కు సూచించారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఎస్‌ఈ రాజేంద్ర కుమార్, డిప్యూటీ ఈఈ నవీన్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.శివ ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జయప్రకాష్‌లు పాల్గొన్నారు.
అంకితభావంతో విధులు నిర్వర్తించాలి
కామారెడ్డిమార్చి 18 ( విజయ క్రాంతి ): వ్యాక్సిన్ కోల్ చైన్ మేనేజర్ లు ఏఎన్‌ఎంలు కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన వారు అంకిత భావంతో పనిచేసి ఉన్నతాధికారుల మన్ననలు పొందాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం తన ఛాంబర్ లో స్టాఫ్ నర్సులు, వాక్సిన్ కోల్ చైన్ మేనేజర్ లుగా కాంట్రాక్టు పద్ధతిన నియామకపు ఉత్తర్వులను కలెక్టర్ అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం తో పాటు అంకిత భావంతో పనిచేసి అధికారుల మన్ననలు పొందాలని అన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ క్రింద కాంట్రాక్టు పద్ధతిన 26 మందికి , వాక్సిన్ కోల్ చైన్ మేనేజర్ గా ఒకరికి నియామకం పత్రాలు కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. చంద్రశేఖర్, సబ్ యూనిట్ ఆఫీసర్ చలపతి లు పాల్గొన్నారు.