రూ.లక్ష పైగా విలువైన మంచినీటి వృధా
గజ్వేల్ 2 బీహెచ్‌కే ఇండ్లలో పైపు నుండి మురికి కాల్వలోకి నీటి లీకేజీ
పట్టించుకోని మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులు..
గజ్వేల్ (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరందించాలన్న లక్ష్యంతో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తాగునీటిని సరఫరా చేస్తుంటే అధికారులు, సిబ్బంది నీటిని వృధాగా మట్టిపాలు చేస్తున్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని సంగాపూర్ లో పట్టణ పేదలకు నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లలో గత ఏడాది కాలంగా మిషన్ భగీరథ తాగునీరు వృధా అవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.
ఈ ఇండ్లలో గత నాలుగేండ్లుగా మల్లన్నసాగర్ నిర్వాసితులు నివసించగా, కొద్దికాలంగా కొన్ని ఇండ్లలో పట్టణ డబుల్ బెడ్రూం లబ్దిదారులు నివాసం ఉంటున్నారు. ప్రతి రోజు రెండుగంటల పాటు నీటి సరఫరా కొనసాగుతుండగా ట్యాంకు నుండి వచ్చే పైపు నుండి ప్రతిరోజు 12వేల లీటర్లు అంటే 22 కుటుంబాల నిత్యవసరాలకు సరిపడా తాగునీరు పైపు నుండి మురికి కాల్వలోకి వృధా పోతున్నాయి. మురికి కాలువ నిండిపోయి డబుల్ బెడ్రుం వీధుల్లోని రహదారుల్లో పారుతూ ఉన్నా ఎవరూ నీటి వృధాను అరికట్టడానికి ప్రయత్నించకపోవడం గమనార్హం. ఎల్లంపల్లి నుండి మల్లన్నసాగర్కు నీటిని తీసుకువచ్చి అక్కడ నీటిని శుద్ధి చేసి ఈ ప్రాంతానికి ప్రభుత్వం తాగునీరందిస్తుంది.
వెయ్యి లీటర్లకు రూ.20 వేలు ఖర్చు పెడుతూ ప్రజలకు తాగునీరందిస్తుంది. ఏడాదిన్నర కాలంగా అంటే దాదాపు రూ.లక్షకుపైగా విలువైన తాగునీరు వృధా అయ్యింది. ఈ నీటిని విక్రయిస్తే కార్పోరేట్ సంస్థలు కోట్ల రూపాయలు సంపాదించేవి. మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులకు మిషన్ భగీరథ నీటి విలువ తెలిసినా కూడా ఈ నీటి వృధా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికైనా అధికారులు ఈ లీకేజీని పూడ్చివేసి తాగునీరు వృధా కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.