29-04-2025 06:26:40 PM
పట్టణ ప్రజలు సహకరించాలని కోరిన మిషన్ భగీరథ అధికారులు...
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం పట్టణమునకు మిషన్ భగీరథ ద్వారా గోదావరి నది నుండి సరఫరా చేసే ఇంటేక్ వెల్ పూడికతీత పనులు ప్రారంభించడం జరుగుతుందని, దీనివలన పట్టణానికి సరఫరా చేయు త్రాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిందని మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నలిని, భద్రాచలం డి ఇ పి. ఏసుబాబు తెలియజేశారు. మే ఒకటో తేదీ నుండి 7వ తేదీ వరకు ప్రతిరోజు పూడికతీత పనులు పగటిపూట వేళలలో జరుగుతాయని, కావున రోజు సాయంత్రం నుండి మరుసటి రోజు ఉదయం వరకు త్రాగునీటి సరఫరా చేయబడుతుందని తెలిపారు.
ఈ కారణం చేత పూర్తి స్థాయిలో త్రాగునీటి సరఫరా చేయలేకపోతున్నామని వారు తెలియజేశారు. పూడిక తీత పనులు యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తున్నందున ప్రజలందరూ ప్రత్యామ్నాయ మార్గముల ద్వారా త్రాగు నీటిని ఏర్పాటు చేసుకోవలసినదిగా కోరుచున్నట్లు తెలిపారు. ఈ అసౌకర్యానికి మనస్ఫూర్తిగా చింతిస్తున్నామని, త్వరతగతిన పూడిక తీత పనులు పూర్తి చేసి నీటి సరఫరా పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. కావున పట్టణ ప్రజలు సహకరించవలసిందిగా ఈ ఈ నలిని, డి ఈ ఏసుబాబు లు కోరారు.