విశాఖ తీరం నుంచి ప్రయోగించిన భారత నౌకాదళం
3,500 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించనున్న కే మిస్సైల్
న్యూఢిల్లీ, నవంబర్ 28: భారత్‌కు కీలకమైన అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిఘాత్‌లో కే బాలిస్టిక్ మిస్సైల్ పరీక్ష జరిగింది. విశాఖపట్నం తీరంలో భారత నావికాదళం దీనిని నిర్వహించింది. అరిఘాత్ నుంచి కే క్షిపణిని ప్రయోగించడం ఇదే తొలిసారి. సాధారణంగా కే క్షిపణి 3,500 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగలుగుతుంది. ప్రస్తుతం అరిఘాత్ నుంచి ప్రయోగించగా దాని ఫలితాలను విశ్లేషిస్తున్నారు. ఐఎన్‌ఎస్ అరిఘాత్ రెండు నెలల క్రితమే రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ జాతికి అంకితం చేశారు.
ఐఎన్‌ఎస్ అరిహంత్‌తో పాటు అరిఘాత్ నిర్మాణం కూడా తూర్పు నౌకాదళానికి చెందిన విశాఖ నేవల్ డాక్‌యార్డ్‌లోని షిప్ బిల్డింగ్ సెంటర్‌లోనే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అణు జలాంతర్గాముల నుంచి బాలిస్టిక్ మిస్సైళ్లు ప్రయోగించగల దేశాల్లో భారత్ ఆరోదిగా ఉంది. చైనాను దృష్టిలో పెట్టుకుని ఈ మిస్సైల్‌ను భారత్ అభివృద్ధి చేసింది.