18-04-2025 12:00:00 AM
హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి, చారిత్రక వైభవం చాటిచెప్పేలా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. గురువారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ప్రపంచ సుందరి పోటీల నిర్వహణపై మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
విశిష్ట సంస్కృతులకు నెలువైన తెలంగాణ వైభవం ఒక్క హైదరాబాద్ నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో నిక్షిప్తమై ఉందన్నారు. ఆయా ప్రాంతాలకు ప్రపంచ దేశాల సుందరీమణులను తీసుకెళ్లి వాటి గొప్పతనాన్ని వివరించాలన్నారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించడం ద్వారా పర్యాటకరంగ అభివృద్ధి తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఇది రాష్ట్ర ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని చెప్పారు.
రాష్ట్ర వ్యా ప్తంగా 20కి పైగా వేదికల్లో వివిధ కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు అధి కారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. సమీక్షా సమావేశంలో పర్యాటక శాఖ సెక్రటరీ స్మితా సబర్వాల్, పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ ప్రకాశ్‌రెడ్డి, పర్యాటక శాఖ డైరెక్టర్ జెండాగే హనుమంత్ కొండిబా, క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ సోనిబాలదేవి, యువజన సర్వీసుల శాఖ డైరెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, భాషా సంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వేగంగా అభివృద్ధి చెందుతున్న పర్యాటకం : మంత్రి జూపల్లి కృష్ణారావు
ఆతిథ్య, టూరిజం రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (నిథమ్)లో యూరోపియన్ యూనియన్ సహకారంతో నిథిమ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్‌ఐపీఏఎస్ (సిపాస్) ప్రాజెక్టుకు సంబంధించిన టూరిజం స్టేక్‌హోల్డర్స్ వర్క్‌షాప్‌ను గురువారం హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో మంత్రి జూపల్లి కృష్ణారావు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు.
వెబ్‌సైట్ www.sipas.in ని మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాశ్ రెడ్డి, పర్యాటక శాఖ, నిథిమ్ సంచాలకులు జెండాగే హనుమంత్ కొండిబా, ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లాథ్వియాకు చెందిన విడ్జెమ్ యూనివర్శిటీ ఆఫ్ అప్లుయిడ్ సైన్సెస్ ప్రొఫెసర్ అగిట, పోర్చుగల్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలిటక్నికో డి సెటుబల్ ప్రొఫెసర్ డురాటే జూరా బ్రాసిల్, పాండిచ్చేరి యూనివర్శిటీ ప్రొఫెసర్ సంపద కుమార్ స్వైన్, సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ కర్ణాటక అసోసియేట్ ప్రొఫెసర్ మహేందర్ ఇతర కన్సార్టియం సభ్యులను మంత్రి జూపల్లి సన్మానించారు. కార్యక్రమానికి వివిధ హోటళ్ల ప్రతినిధులు, ట్రావెల్ ఏజెన్సీలు, టూర్ ఆపరేటర్లు హాజరయ్యారు.