calender_icon.png 16 January, 2025 | 5:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాడితప్పిన రెవెన్యూ పాలన

01-07-2024 01:28:33 AM

  1. బదిలీలపైనే ఉద్యోగుల దృష్టి.. విధులపై నిర్లక్ష్యం
  2. ధరణి సమస్యలపై దృష్టి పెట్టని తహసీల్దార్లు
  3. కొరవడిన పై అధికారుల పర్యవేక్షణ

సంగారెడ్డి, జూన్ 30 (విజయ క్రాంతి) : ప్రభుత్వం అమలు చేసే అభివృద్ది, సంక్షేమ పథకాల అమల్లో కీలక పాత్ర పోషించే తహసీల్దార్లు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శాసనసభ ఎన్నికల ముందు సంగారెడ్డి జిల్లాలో పని చేస్తున్న తహసీల్దార్లను ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. ఇతర జిల్లాలో పని చేస్తున్న తహసీల్దార్లను సంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు.

పార్లమెంట్ ఎన్ని కల వరకు ఎన్నికల విధుల్లో మునిగిపోయిన తహసీల్దార్లు.. ఎన్నిక కోడ్ ముగిసిన అనంతరం బదిలీలపై తప్ప విధులపై దృష్టి పెట్టడం లేదు. ఎన్నికల కోడ్‌తో ఇతర జిల్లాలకు వెళ్లిన తహసీల్దార్లు గతంలో తాము పని చేసిన మండలాలకు తిరిగి వచ్చేందుకు ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టు తిరుగుతున్నారని తెలుస్తోంది. ఎక్కవ మంది తహసీల్దార్లు అధిక ఆదాయం గల సంగారెడ్డి, జహీరాబాద్ రెవెన్యూ డివిజన్‌లో పని చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఇలా లాబీయింగుల్లో బిజీబిజీగా గడుపుతూ పాలన పక్కన పెడుతున్నారు. కొందరు అధికారులు కార్యాలయాలకు వచ్చి కులం, ఆదాయం ధృవీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారు తప్ప ధరణి దరఖాస్తుల జోలికి పోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. 

ప్రభుత్వ భూములపై పర్యవేక్షణ లేక..

సంగారెడ్డి డివిజన్‌లో ప్రభుత్వ భూములను కాపాడాల్సిన తహసీల్దార్లు నిర్లక్ష్యంగా పని చేయడంతో అసైన్డ్ భూములు ప్లాట్లుగా మారిపో తున్నాయి. అమీన్‌పూర్, పటాన్‌చెరు, కంది, హత్నూర, కొండాపూర్, సదాశివపేట, మునిపల్లి, గుమ్మడిదల మండలాల్లో పనిచేసే అధికారుల పర్యవేక్షణ లేక విలువైన ప్రభుత్వ భూములు కనుమరుగవుతున్నాయి. కొందరు తహసీల్దార్లు రియల్ వ్యాపారులకు వత్తసు పలుకడంతో ప్రభుత్వ భూముల్లో వెంచర్లు వేసినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదు. తహసీల్దార్‌లు వారం రోజుల్లో తమ జిల్లాకు బదిలీపై వెళ్లిపోతామనే ధీమాతో కార్యాలయాల్లో ఉండటం లేదు. దీంతో, సమస్యలపై తహసీల్దారు కార్యాలయాలకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

బదిలీలపై దృష్టి పెట్టడంతో..

రాష్ట్రంలో తహసీల్దార్లు పదేపదే బదిలీ అవుతుండటంతో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొత్త తహసీల్దార్ వచ్చిన తరువాత పనులు చేసుకోవాలని ప్రజలకు ఉచిత సలహా ఇచ్చి తప్పిం చుకుంటున్నారని ప్రజలు వాపోతున్నారు. బదిలీపై ఇతర జిల్లా నుంచి వచ్చిన తహసీల్దార్లు విధు ల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వారు ధరణి భూ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడం లేదు. కార్యాలయాలకు 11 గంటల తరువాత రావడం, 1 గంటకు భోజనం చేసి సంగారెడ్డి కలెక్టరేట్‌లో పని ఉందని వెళ్లిపోవడం నిత్యకృత్యంగా మారింది. దీంతో, సమస్య లపై కార్యాలయాలకు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో తహసీల్దార్లు ఇష్టారాజ్యంగా పని చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.