13-02-2025 01:59:49 AM
కార్వాన్, ఫిబ్రవరి 12: శివాలయంలో శివలింగం వద్ద మాంసం ముద్దలు కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన మంగళహట్ డివిజన్‌లోని నటరాజనగర్ ప్రాంతంలో బుధవారం ఉదయం వెలుగుచూసింది. నటరాజనగర్ ప్రాంతంలోని హ నుమాన్ మందిరంలో శివాలయం కూడా ఉంది. ఉదయం ఆలయానికి వెళ్లిన అర్చకుడు శివలింగం వెనుకాల మాంసం ముద్ద ను చూశాడు.
పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెళ్లి సీసీ కెమెరాలను పరిశీ లించారు. విషయం తెలిసి హిందూసంఘా లు, బీజేపీ నాయకులు అక్కడికి భారీగా చే రుకొని ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కుల్సుంపుర, గోషామహల్, ఆసిఫ్‌నగర్ ఏసీపీలు, పోలీసు బలగాలు బందోబస్తు నిమిత్తం అక్కడికి చేరుకున్నారు.
సౌత్ వెస్ట్‌జోన్ డీసీపీ చంద్ర మోహన్, అడిషనల్ డీసీపీ, నగర జాయింట్ సీపీ విక్రంసింగ్‌మాన్ చేరుకుని ఆందోళనకారులను సముదాయించారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని, ఆలయ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఎవరి ప్రమేయమైనా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా సీసీ కెమెరాలను పరిశీలించగా ఓ పిల్లి మాంసం ముద్దను పట్టుకొని వెళ్లి ఆలయంలో వేసినట్లు గుర్తించామని డీసీపీ చంద్రమోహన్ తెలిపారు. ఈ వీడియోను పోలీసులు విడుదల చేశారు
నిందితులను శిక్షిస్తాం: జాయింట్ సీపీ
నిందితులను సత్వరమే గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ సీపీ విక్రంసింగ్‌మాన్ తెలిపారు. ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు లేవని, సాయంత్రం నుంచి సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయం వద్ద కానిస్టేబుల్‌ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
పోలీసులది పాత కథే: రాజాసింగ్
శివలింగంపై కొందరు దుండగులు రాత్రి సమయంలో ఆలయం వెనుక వైపు నుంచి మాంసం ముద్దలు వేశారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. పోలీసులు గతంలో చెప్పిన మాదిరిగానే పిల్లి, కుక్క వచ్చి మాంసం ముద్దలు వేసిందంటున్నారని మండిపడ్డారు. అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయని, కానీ అవి పనిచేయడం లేదని తప్పుడు సమాచారం ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో హైదరాబాద్ సీపీ ప్రత్యేక చొరవ తీసుకొని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.