calender_icon.png 26 December, 2024 | 1:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖలిస్థానీల దుశ్చర్య

06-11-2024 12:00:00 AM

కెనడాలో ఖలిస్థానీలు మరోసారి రెచ్చిపోయారు. తాజాగా ఆదివారం బ్రాంప్టన్ నగరంలోని హిందూ సభా మందిర్ వెలుపల హిందువులపై ఖలిస్థానీ సానుభూతిపరులు విచక్షణారహితంగా దాడి చేశారు. విచిత్రమేమిటంటే అక్కడ ఉన్న పోలీసులు సైతం హిందువులపైనే లాఠీ ఝళిపించారు. కెనడాలోని హిందువులను భయపెట్టడం కోసం గత కొంతకాలంగా ఖలిస్థానీవాదులు జరుపుతున్న వరస దాడులలో భాగంగానే ఈ దాడి జరిగినట్లు స్థానిక హిందువులు ఆరోపిస్తున్నారు.

భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు ఇటీవలి కాలంలో క్షీణించిన నేపథ్యంలో జరిగిన ఈ దాడిపై కెనడా వ్యాప్తంగా హిందువుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడి ఉద్దేశపూర్వకంగా జరిగిందని ఆయన అంటూ ఇలాంటి హింసాత్మక చర్యలు భారత స్థుర్యైన్ని తగ్గించలేవన్నారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సైతం దాడిని ఖండించారు.

ఇలాంటి దాడులు ఆమోదయోగ్యం కాదన్న ఆయన కెనడాలో నివసించే ప్రతి ఒక్కరికీ వారి మతాభిమానాలను కొనసాగించే హక్కు ఉందన్నారు.  మరోవైపు దాడికి వ్యతిరేకంగా సోమవారం రాత్రి ఉత్తర అమెరికాలోని హిందూమహాసభ ఆధ్వర్యంలో వేలాది హిందువులు బ్రాంప్టన్ ఆలయం వెలుపల భారీ ర్యాలీ నిర్వహించారు.ఖలిస్థానీలకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కెనడాలోని హిందూ ఆలయాలపై గత కొంతకాలంగా  తీవ్రవాదులు వరస దాడులు చేస్తున్నారని అక్కడి భారత హైకమిషన్ పేర్కొంటూ, అన్ని ప్రార్థనాస్థలాల వద్ద తగిన రక్షణ ఉండేలా చూడాలని కోరింది.

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి జైశంకర్ సైతం ఈ ఘటనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అతివాద శక్తులకు కెనడా రాజకీయాల్లో చోటు కల్పిస్తున్న ఫలితంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ మండిపడ్డారు. కాగా ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు హిందువులను అరెస్టు చేయడమే కాక ఓ పోలీసు అధికారిని సస్పెండ్ చేసినట్లు కెనడా పోలీసు వర్గాలు తెలిపాయి.

భారత్‌లో ఖలిస్థానీ వేర్పాటువాదుల అణచివేత ప్రారంభించడంతో విదేశాల్లో స్థిరపడ్డ పంజాబీల్లో కొందరు అతివాదులు ఖలిస్థానీవాదులకు ఆశ్రయం కల్పించడం, వారికి మద్దతుగా నిలవడం లాంటివి చేపడుతూ వస్తున్నారు. ముఖ్యంగా సిక్కులు అధిక సంఖ్యలో ఉన్న కెనడా వేదికగా ఖలిస్థాన్ డిమాండ్ మొదలు పెట్టారు. తమ ఉద్యమంలో భాగంగా వారు అక్కడి హిందూ ఆలయాలపై దాడులు చేయడం ద్వారా హిందువుల్లో భయభ్రాంతులు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు.

గతంలోనూ హిందూ ఆలయాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి. గత ఏడాది డిసెంబర్‌లో సర్రేలోని స్వామి నారాయణ మందిర్ అధ్యక్షుడి కుమారుడి నివాసంపై కాల్పులు కూడా జరిపారు. ఇప్పుడు కూడా బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయంలో సీనియర్ సిటిజన్స్ కోసం భారత కాన్సులేట్ నిర్వహిస్తున్న శిబిరం లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు అక్కడి భారత దౌత్యవర్గాలు చెబుతున్నాయి. కెనడాలోని ఆలయాలు, గురుద్వారాలలో అక్కడి భారత హైకమిషన్ ఇలాంటి శిబిరాలను నిర్వహించడం పరిపాటి.

వచ్చేఏడాది జరగబోయే కెనడా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి విజయం కోసం యత్నిస్తున్న ట్రూడో సిక్కులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ట్రూడో పట్ల సొంత పార్టీతో పాటుగా అక్కడి ప్రజల్లో ముఖ్యంగా భారతీయుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పంజాబ్ తర్వాత కెనడాలోనే సిక్కులు అధిక సంఖ్యలో ఉన్నారు. ట్రూడో ప్రభుత్వంలో రక్షణమంత్రి సహా నలుగురు సిక్కులు మంత్రులుగా ఉన్నారు.

అయితే సిక్కులందరూ ఖలిస్థానీ వాదులు కాదనే విషయాన్ని ట్రూడో అర్థం చేసుకోవాలని మెజారిటీ సిక్కులు అంటున్నారు. అంతేకాదు, ఇప్పటికే భారత్‌తో దౌత్య సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో ఇలాంటి ఘటన ఏది జరిగినా అది తనకు మరింత వ్యతిరేకంగా మారుతుందని ట్రూడో ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిదని విశ్లేషకులు అంటున్నారు. మరి ట్రూడో ఏం చేస్తారో చూడాలి.