calender_icon.png 25 October, 2024 | 5:55 AM

స్టడీ టూర్ల పేరుతో నిధుల దుర్వినియోగం

25-10-2024 01:15:15 AM

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, అక్టోబర్ 24: స్టడీ టూర్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేస్తోందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. గురువారం కాచిగూడలోని ఓ హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత వచ్చిన ఆదాయం, చేసిన ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వానికి వివిధ పన్నులు, గ్రాంట్ల ద్వారా లక్ష కోట్ల ఆదాయం సమకూరగా, పది నెలల వ్యవధిలో రూ. 80 వేల కోట్లు అప్పు తెచ్చారని అన్నారు. అయితే, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ. 4 వేల కోట్లు విడుదల చేయడంలో సీఎం రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, స్కాలర్‌షిప్ పెంచడం, గురుకులాలకు పక్కా భవనాలు నిర్మించలేని దుస్థితిలో ఉందని మండిపడ్డారు. కార్యక్రమం లో బీసీ సంఘాల నేతలు నీల వెంకటేశ్ ముదిరాజ్, నందగోపాల్, జీ అనంతయ్య, ఉదయ్ నేత, నరేందర్, రమేశ్, పీ యాదయ్య, విజయ్ యాదవ్, గంజి వెంకన్న, ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షుడు నిమ్మల వీరన్న  పాల్గొన్నారు.