గ్రేటర్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్‌లో నిర్మించనున్న పలు ప్రాజెక్టులపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జీహెచ్‌ఎంసీ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సమీక్షించారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి, ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, మూసీ రివర్‌ఫ్రంట్ కార్పొరేషన్ ఎండీ గౌతమి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మీరాలం చెరువుపై నిర్మిస్తున్న బ్రిడ్జికి సంబంధించిన డీపీఆర్ 90 రోజుల్లో, 30 నెలల్లో బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నగరంలో అత్యంత ప్రముఖ ప్రాంతంగా ఉండేలా మీరాలం బ్రిడ్జిని తీర్చిదిద్దాలని సూచించారు. హైదరాబాద్‌లో నిర్మాణం చేసే కొత్త ఫ్లుఓవర్లపై మ రింత లోతుగా అధ్యయనం చేయాలన్నారు.
రోడ్ల వెడల్పుపై అధికారులకు పలు సూచనలు చేశారు. సమగ్రమైన స మాచారంతో మరో రెండు రోజుల్లో నిర్వహించే సమావేశానికి రావాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మీరాలంపై 2.425 కిలోమీటర్ల నిర్మాణం చేసే బ్రిడ్జికి సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు సీఎంకు సూచించారు.