calender_icon.png 23 December, 2024 | 8:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిరాకిల్ మంత్ డిసెంబర్

22-12-2024 02:58:15 AM

* క్రీస్తు పుట్టింది, తెలంగాణ  ప్రకటన, సోనియమ్మ జన్మదినం ఈ నెలలోనే..

*  సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 21(విజయక్రాంతి): డిసెంబర్ ఒక మిరాకిల్ మంత్ అని.. ఏసుక్రీస్తు జన్మదినం, తెలంగాణ ప్రకటన వెలువడింది, కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ పుట్టినరోజు, తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది ఈ నెలలోనే అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం సర్వమతాలకు రక్షణగా ఉంటుందని సీఎం తెలిపారు. నగరంలోని ఎల్బీ స్టేడియంలో శనివారం రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పీసీసీ పదవుల్లో క్రైస్తవులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రభుత్వ బాధ్యతల్లోనూ క్రైస్తవులకు స్థానం కల్పిస్తామని స్పష్టం చేశారు.

ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో క్రైస్తవ సంస్థల పాత్ర ఎంతో ఉందని సీఎం అన్నారు. నిన్ను నువ్వు ప్రేమించినట్లే.. నీ పొరుగువారిని ప్రేమించాలనేదే క్రీస్తు సందేశమని చెప్పారు. ప్రభుత్వం అందించే వైద్య సేవలతో పాటు తండాలు, గూడాలు, మారుమూల ప్రాంతాల్లో క్రైస్తవ సంస్థలు వైద్య సేవలందిస్తున్నాయని పేర్కొన్నారు. విద్య, వైద్యంలో క్రైస్తవ సంస్థలు ప్రభుత్వంతో పోటీపడి చేస్తున్న సేవా కార్యక్రమాలు సమైక్య స్ఫూర్తిని నింపుతున్నాయన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. చర్చిల పునర్నిర్మాణం, అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుందని సీఎం తెలిపారు. క్రైస్తవ పెద్దల సమక్షంలో వేదికపై సీఎం రేవంత్‌రెడ్డి క్రిస్మస్ ట్రీ లైట్ వెలిగించి, అనంతరం కేక్ కట్ చేశారు. పలువురికి సీఎం స్వయంగా క్రిస్మస్ కానుకలు అందజేశారు.  సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు ప్రక్రియ మొదలవుతుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

మంత్రులు పొంగులేటి, పొన్నం, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్  అలీ, వేంనరేందర్ రెడ్డి, క్రిష్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ జాన్ కుక్కడం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ డాక్టర్  జితేందర్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ క్రాంతి వెస్లీ, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.