11-03-2025 12:15:17 AM
ధరలేక మార్కెట్‌లోనే పంట పారబోత
నిల్వ చేసుకునే అవకాశం లేదని రైతుల ఆవేదన
కోల్ స్టోరేజీ సెంటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్
చేవెళ్ల, మార్చి 10 (విజయక్రాంతి): పుదీనా... మనం వండే ప్రతి వంటలో వాడుతుంటాం. సూపర్ మార్కెట్కు వెళ్తే ఒక్కో కట్ట రూ.10కి అమ్ముతుంటారు. చిరు వ్యాపారుల దగ్గరికి వెళ్లినా రూ.5 కి తక్కువ ఉండదు. కానీ, రైతులకు మాత్రం కట్టకు ఒక్క రూపాయి కూడా రావడం లేదు.
పోనీ నిల్వ చేసుకొని తర్వాత అయినా అమ్ముకుం దామనుంచే ప్రభుత్వాలు అలాంటి ఏర్పాట్లు చేయడం లేదు. దీంతో ధర తగ్గినప్పుడల్లా మార్కెట్లోనే పారబోయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఫలితంగా కూలీల ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. కోల్ స్టోరేజీలు ఏర్పాటు చేసి ధర ఉన్నప్పుడు అమ్ముకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. మరిన్ని రైతులు బజార్లు, పుదీనా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసినా కొంత మేర మేలు జరుగుతుందని అంటున్నారు.
పెరిగిపోయిన పెట్టుబడి ఖర్చులు
పుదీనా పంట ఎకరం, అరెకరం ఉన్న రైతులు కూడా సాగు చేసుకోవచ్చు. కానీ, అడుగు మందులు, పిచికారీ మందుల ధరలు, కూలీ రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో గిట్టుబాటు కావడం లేదు. పంట కాలం 45 రోజుల నుంచి 60 రోజులే అయినప్పటికీ... ఒక ఎకరానికి సహజ ఎరువులు (పశువుల పేడ, పౌల్ట్రీ ఎరువు) తో పాటు యూరియా, డీఏపీ లాంటి మందులు వేయాల్సి ఉంటుంది. పంటకు దోమ, పచ్చ పురుగు, నల్ల పురుగు, ఆకు తెగులు, పేను బంక తదితర రోగాలు వస్తుంటాయి.
వీటి నివారణకు క్యాబ్రి యో టాప్, అక్టోబట్, ర్యాపిడ్, బెంజర్, ప్రోక్లెయిమ్, అమిస్టార్, పితోరా... తదితర మందులు వాడుతుంటారు. వీటితో పాటు కలుపు, కోత కూలీల ఖర్చులు కలుపుకొని... రూ. 60 వేల నుంచి రూ. 80 వేల వరకు ఖర్చు అవుతోంది. ఈ పంట కోస్తే దాదాపు 80 వేల నుంచి లక్ష కట్టలు వస్తాయి. అంటే మార్కెట్లో మినిమం కట్టకు రూ.1.50 నుంచి రూ.2 పలికితే కొంత లాభం ఉంటుంది. కానీ, ప్రస్తుతం ఒక్కో కట్ట రూ.40 పైసల నుంచి రూ. 60 పైసలు మాత్రమే పలుకుతుంది. ఈ లెక్కన ఒక్క పంటకు (రెండు నెలలు) రూ. 30 వేల వరకు నష్టం వస్తుందని రైతులు వాపోతున్నారు.
కోల్ట్ స్టోరేజీలు లేవు
పుదీనా పంటను సాధారణంగా చేవెళ్ల నియోజకవర్గంలో ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఇందులోనూ చేవెళ్ల మండలం ముడిమ్యాల, మల్కాపూర్, రావుల పల్లి , కుమ్మెర, మొయినాబాద్ మండలం తోలుకట్ట, అప్పారెడ్డి గూడ, నక్కల పల్లి తదితర గ్రామాల్లో ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఈ గ్రామాల నుంచి ప్రతి రోజూ కనీసం రెండు మినీ వ్యాన్లలో హైదరాబాద్లోని గుడి మల్కాపూర్ మార్కెట్కు తీసుకెళ్తుంటారు.
పంట మొత్తం అమ్మితే సరే.. లేదంటే నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో పారబోయాల్సిన పరిస్థితి ఉంటోంది. కోల్ట్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తే మరుసటి రోజు అమ్ముకునే చాన్స్ ఉంటుందని రైతులు చెబుతున్నారు. అంతేకాదు ఈ పంటలు ప్రాంతంలోనే పుదీనా ప్రాసెపింగ్ యూనిట్లు ఏర్పాటు చేయించి.. వారికే అమ్మేలా ఒప్పందం చేయిస్తే మేలు జరుగుతందని అంటున్నారు. దీంతో పాటు నగర శివారులో మరో మార్కెట్ తో పాటు మరిన్ని రైతు బజార్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇలా చేస్తే రైతులు నేరుగా వినియోగదారులకు అమ్ముకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.