22-03-2025 05:43:14 PM
మౌలిక వసతులు కల్పించాలని తుడుం దెబ్బ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి...
పోలీసులకు ఆదివాసీలకు మధ్య తోపులాట...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదివాసీలు నివసిస్తున్న కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. మవల మండలంలోని కొమరం భీమ్ కాలనీ ఆదివాసీలు గుడిసెలు వేసుకుని గత కొన్ని సంవత్సరాలుగా నివసిస్తున్నప్పటికీ కనీస మౌలిక సదుపాయాలు త్రాగునీరు, రోడ్లు, విద్యుత్, మురికి కాలువ లేక కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారని పలుమార్లు అధికారులకు విన్నవించిన ఫలితం లేకుండా పోయింది. దీంతో తుడుం దెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ గోడం గణేష్ నేతృత్వంలో కలెక్టరేట్ ముట్టడికి దిగారు. ఆదివాసీలు పెద్ద ఎత్తున కలెక్టరేట్ కు తరలివచ్చారు. ఈ క్రమంలోనే కలెక్టరేట్ లోకి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆదివాసీలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఆదివాసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది.
కలెక్టరేట్ ప్రధాన గేటు పైకి ఆదివాసులు ఎక్కేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉధృత చోటుచేసుకుంది. అనంతరం ఆర్డీఓ వినోద్ కుమార్ ఆందోళనకారులు వద్దకు వచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గోడం గణేష్ మాట్లాడుతూ... కొమరం భీం కాలనీ నుండి ఆదివాసీలను వెళ్ళగొట్టడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కొందరు అధికారులతో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కుమ్మకై ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా ఆదివాసీల గుడిసెల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ నిరసనలో తుడుం దెబ్బ నాయకులు, ఆదివాసీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.