calender_icon.png 31 October, 2024 | 6:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జంతర్‌మంతర్ వద్ద మంత్రులు దీక్షచేయాలి

25-07-2024 01:01:56 AM

హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): తెలంగాణకు నిధులు వచ్చుడో లేదా తాము సచ్చుడో తేలాలని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో బుధవారం శపథం చేశారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కేంద్ర బడ్జెట్‌లో నిధుల కోసం తెలంగాణ మంత్రిమండలి ఆమరణ నిరాహార దీక్షకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దతు తెలిపారు. మంత్రుల దీక్షకు అండగా నిలబడుతామని చెప్పారు. దీనిపై రేవంత్‌రెడ్డి స్పందిస్తూ ఢిల్లీలో చర్చకు సిద్ధమని, సీఎంగా తాను, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వస్తే ఇద్దరమూ కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని తెలిపారు. నిధులన్నా రావాలి లేదా తామన్నా చావాలని పేర్కొన్నారు. 

అధికార పార్టీకి మద్దతుగా ఉంటాం

అసెంబ్లీలో కేంద్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. మేము ఏదై నా తప్పులు చేసి ఉంటే, దానికే కదా మమ్మ ల్ని శిక్షించి ప్రజలు ఇక్కడ (ప్రతిపక్షంలో) కూర్చోబెట్టారు అని పేర్కొన్నారు. అధికార పార్టీ సభ్యులతో వాగ్వాదంలో భాగంగా ఆయన ఈ విధంగా స్పందించారు. కేంద్రం బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, ఈ విషయంలో తాము రాష్ట్ర ప్రభు త్వానికి మద్దతుగా నిలుస్తామని చ్పెపారు. కేంద్రంలోని ఎన్డీయే, బీజేపీ ప్రభుత్వం నీతిమాలిన వ్యవహారాన్ని తాము మొదటి నుం చి వ్యతిరేకిస్తున్నామన్నారు. తాము ఎవరితో నూ చీకటి ఒప్పందాలను చేసుకోలేదన్నారు. విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్రం డిస్కంలను ప్రైవేటీకరించేందుకు సిద్ధమవుతోం దని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించొద్దని సూచించారు. 

బీఆర్‌ఎస్ లేకపోవడం వల్లే.. 

లోక్‌సభలో తెలంగాణ అనే పదం వినపడలేదని కేటీఆర్ మరోసారి అన్నారు. బీఆర్‌ఎస్ ఎంపీలు ఉంటే పార్లమెంటులోనే వ్యతిరేకించేవారమని పేర్కొన్నారు. 8+8 కలిపితే పదహారు అవుతుందని, కానీ బడ్జెట్ విషయంలో తెలంగాణకు గుండు సున్నా అయ్యిందన్నారు. మోదీతో కేసీఆర్‌కు సఖ్యత లేకపోవడం వల్లే గతంలో రాష్ట్రానికి అన్యా యం జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు చెప్పారని గుర్తుచేశారు. అందుకే కేంద్రంతో సఖ్యత కోసం తెలంగాణకు మోదీ వచ్చినప్పుడు, భడే భాయ్, ఛోటే భాయ్ అని సంబోధించారని, అయినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు.

ఏమీ చేసినా తెలంగాణకు అన్యాయమే జరుగుతుందని కాంగ్రెస్‌కు ఇప్పుడు తత్వం బోధపడిందన్నారు. తాము చేసిన పనులను కాంగ్రెస్ వారి ఖాతాలో వేసుకుందని విమర్శించారు. పక్కరాష్ట్రానికి సాయం చేస్తే ఎలాంటి బాధ లేదని.. కానీ, తెలంగాణకు నిధులు రాకపోవడం చాలా బాధాకరమన్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీలు పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని కొన్ని రాష్ట్రాల ఎంపీలు ధర్నా చేశారని, తెలంగాణ ఎంపీలు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు.