11-03-2025 02:21:18 PM
బెంగళూరు: కన్నడ నటి రన్యారావు బంగారం అక్రమ రవాణా కేసుతో ఇద్దరు మంత్రులకు సంబంధాలు ఉన్నాయని వస్తున్న వార్తలను కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తోసిపుచ్చారు. ఆ నివేదికలు రాజకీయ గాసిప్స్ అని అభివర్ణించారు. కేంద్ర సంస్థలు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని కూడా ఆయన పేర్కొన్నారు. రన్యారావు కేసులో ఏ మంత్రి ప్రమేయం లేదు.. తమకు ఏమీ తెలియదని, దానితో సంబంధం లేదు" అని శివకుమార్ తెలిపారు. ఈ కేసుపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని, వారు చేయనివ్వండని మీడియా సమావేశంలో అన్నారు.
మార్చి 3న దుబాయ్ నుండి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న రన్యా రావు(34)ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అరెస్టు చేసింది. ఆమె నుండి రూ.12.56 కోట్ల విలువైన బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. మరుసటి రోజు బెంగళూరులోని రన్యారావు నివాసంలో రూ.2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2.67 నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఐ అధికారులు(DRI) వెల్లడించారు. రన్యా ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డీజీపీ హోదా కలిగిన పోలీసు అధికారి కె.రామచంద్రరావు సవతి కూతురు. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే.