04-04-2025 09:25:33 PM
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి
కామారెడ్డి,(విజయక్రాంతి): రేషన్ షాపులకు సన్న బియ్యం రవాణా వేగవంతం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్న బియ్యం సరఫరాపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 40 రూపాయలు పైగా కిలో బియ్యానికి వెచ్చించి ప్రజలకు ఉచితంగా దొడ్డు బియ్యం సరఫరా చేశామని, చాలా పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేసి ప్రజలకు బియ్యం సరఫరా చేస్తున్నప్పటికీ 70 నుంచి 80 శాతం వరకు ఆ బియ్యాన్ని ప్రజలు తినేవారు కాదని, రీసైక్లింగ్ ద్వారా కోళ్ల ఫారాలకు, ఇతర అవసరాలకు తరలి వెళ్లేదని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో అత్యధిక జనాభా దొడ్డు బియ్యం తినడం ఆపేసారని, దీనిని గమనించి రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఉచితంగా సరఫరా చేసే కార్యక్రమం చేపట్టామని అన్నారు. సన్న బియ్యం సరఫరా పంపిణీ విజయవంతం అవుతుందని అన్నారు, పేదలు, ప్రజలు సన్న బియ్యం సంతోషంతో స్వీకరిస్తున్నారని అన్నారు. రేషన్ షాపులకు సన్న బియ్యం సరఫరా రవాణా వేగవంతం చేయాలన్నారు. 13 వేల కోట్లు ఖర్చు చేసి 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రేషన్ కార్డుదారులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చూడాలని అన్నారు. సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ సన్న బియ్యం సరఫరా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా లాంచ్ చేయడం జరిగిందని, దీనికి కృషి చేసిన అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
సన్న బియ్యం పంపిణీ కారణంగా రేషన్ షాపుల వద్ద ఒకేసారి డిమాండ్ పెరిగి పోతున్నందున బియ్యం రవాణా వేగవంతం చేయాలని, రేషన్ షాపుల వద్ద అవసరమైన మేర బియ్యం అందుబాటులో పెట్టాలని అన్నారు. పేదల ఇంటికి సన్న బియ్యం సరఫరా అతి గొప్ప విజయమని అన్నారు. నూతన రేషన్ కార్డుల దరఖాస్తుల స్క్రూటిని వేగవంతం చేయాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులతో మాట్లాడుతూ, జిల్లాలోని 578 రేషన్ దుకాణాలకు 5571.80 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం సరఫరాకు గాను, 5,527.04 (99.2%) మెట్రిక్ టన్నుల సన్న బియ్యం జిల్లాలోని చౌక ధరల దుకాణాలకు సరఫరా చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా అధికారులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాపంపిణీ ద్వారా పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 15 వ తేదీ లోగా పూర్తిచేయాలని తెలిపారు.