19-04-2025 07:16:09 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ ప్రజలు పండించిన వరి ధాన్యం కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మంత్రి ఉత్తమ్ జిల్లా కలెక్టర్లు, ముఖ్య అధికారలతోనూ ధాన్యం కొనుగోళ్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి కొనుగోళ్లను కేంద్రాలను పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఈ ఏడాది తెలంగాణ మరో రికార్డు స్థాయిలో యాసంగి వరి ఉత్పత్తికి సిద్ధమైందని ఉత్తమ్ చెప్పారు. 127.50 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అంచనా అని వానకాలం, యాసంగి మొత్తం కలిపి 281 లక్షల టన్నుల దిగుబడి వచ్చిందని మంత్రి వెల్లడించారు. అనంతరం రబీ సేకరణ సంసిద్ధతను సమీక్షించారు. తెలంగాణ ప్రభుత్వం 2024–25 రబీ సీజన్ కోసం పెద్ద ఎత్తున వరి సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిందని, 70.13 లక్షల మెట్రిక్ టన్నుల (LMTs) లక్ష్యాన్ని నిర్దేశించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.