సంక్రాంతి తరువాత రైతు భరోసా
నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
కామారెడ్డి,(విజయక్రాంతి): సన్న వడ్లకు బోనస్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్ నీటిని వదిలిన అనంతరం నిజాంసాగర్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, పంటల బీమా అమలు చేయడంతోపాటు సంక్రాంతి తరువాత నుంచి రైతు భరోసా అందిస్తామన్నారు.
దేశ చరిత్రలోనే నిజాం సాగర్ ప్రాజెక్టుకు విశిష్టత ఉందని, అటువంటి ప్రాజెక్టును సందర్శించడం సంతోషంగా ఉందన్నారు. నిజాం సాగర్ నీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలని, పంటలకు నీటిని ఆన్ ఆఫ్ పద్ధతిలో అందిస్తామని తెలిపారు. నాగ మడుగు ప్రాజెక్టుకు తగినన్ని నిధులు ఇచ్చి త్వరలోనే పనులు పూర్తి చేస్తామన్నారు. దీంతో పాటుగానే అంతర్ రాష్ట్ర ప్రాజెక్టు లెండి నిర్మాణం పూర్తి కావడానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి పనులు సాగేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
దేశంలోనే ఈసారి తెలంగాణలో అత్యధిక విస్తీర్ణంలో వరి సాగయ్యిందని, కాళేశ్వరం నుంచి చుక్క నీరు వాడుకోలేదన్నారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించి రైతులకు మూడు రోజుల్లో డబ్బుల చెల్లింపు పూర్తి చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు సన్నాలకు .500 చొప్పున బోనస్ అందిస్తామన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఇరిగేషన్ ను నాశనం చేసిందని, లక్షల కోట్ల అప్పులు చేసి నాటి ప్రభుత్వం సాధించింది ఏమి లేదని విమర్శించారు. తాము పదినెలల కాలంలో 55వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు.
ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నామని, త్వరలో రేషన్ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వేప్రారంభమైందన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా తమ ప్రభుత్వానికి ప్రజా ఆశీర్వాదం ఉంటుందన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, తోట లక్ష్మీకాంతారావు, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే బాన్సువాడ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ లు మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పిటిసిలు తదితరులు పాల్గొన్నారు.