20-02-2025 04:37:21 PM
కాళేశ్వరం నీళ్లు రాలేదు.. బీఆర్ఎస్ నేతల జేబులు నిండాయి
బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం
జగన్ తో స్నేహంగా ఉంటూ.. ఏపీ జలదోపిడీకి సహకారం
జగన్ పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతుంటే కేసీఆర్ నోరెత్తలేదు
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ అన్యాయం జరగనీయం
హైదరాబాద్: కాళేశ్వరంతో నీళ్లు రాలేదు కానీ బీఆర్ఎస్ నేతల జేబులు నిండాయని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) ఆరోపించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. కాళేశ్వరంపై రూ. లక్ష 30 వేల కోట్లు ఖర్చ చేస్తే మేడిగడ్డ కూలిపోయిందని మంత్రి పేర్కొన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు(Palamuru-Rangareddy Project)పై రూ. 25 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అప్పు తెలంగాణ ప్రజలు ఎన్నటికీ తీర్చలేనంత భారంగా మారిందని వివరించారు. కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం అధికంగా వాడుకుంటున్న విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లానని మంత్రి ఉత్తమ్ వివరించారు.
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt) కనీసం టెలిమెట్రీలు కూడా ఏర్పాటు చేయలేదని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కృష్ణా నదిపై టెలిమెట్రీలు ఎందుకు ఏర్పాటు చేయలేదు? అని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న జలదోపిడీకి బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించిందని ఆయన ఆరోపించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 200 టీఎంసీలు సరిపోతాయని చెప్పిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కుతోందన్నారు. తెలంగాణకే 500 టీఎంసీలు కావాలని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాదన ప్రారంభించామని మంత్రి వెల్లడించారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అద్బుతంగా ఉండేదన్నానరు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకు ఒక్క టీఎంసీకి కూడా అనుమతి సాధించలేదని ద్వజమెత్తారు. సీతారామ ప్రాజెక్టుకు 67 టీఎంసీల అనుమతిని తామే సాధించామని మంత్రి స్పష్టం చేశారు. సమ్మక్క-సారక్క ప్రాజెక్టుకు కూడా అనుమతులు మేమే సాధించామని చెప్పారు.
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం, కుంగిపోవటం బీఆర్ఎస్ పాలన కాలంలోనే జరిగిందని ఆయన ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై కేసీఆర్ ఎప్పుడూ నోరు కూడా విప్పలేదన్నారు. మేడిగడ్డ డిజైన్, నిర్మాణంలో లోపాలు ఉన్నాయి జాతీయ డ్యామ్ సేఫ్టీ కమిటీ చెప్పిందని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా ప్రాజెక్టుల కోసం దీర్ఘకాలిక, తక్కువ వడ్డీకి రుణాలు తెస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల కక్కుర్తి కోసం అడ్డగోలుగా ఎక్కువ వడ్డీకి అప్పులు తెచ్చిందని ఉత్తమ్ కుమార్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. వైఎస్ జగన్(YS Jagan Mohan Reddy)తో స్నేహంగా ఉంటూ.. ఏపీ జలదోపిడీకి సహకరించారని మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతుంటే కేసీఆర్ నోరెత్తలేదని ప్రశ్నించారు. జగన్ అక్రమంగా ముచ్చుమర్రి నిర్మిస్తుంటే కేసీఆర్ నోరెత్తలేదన్నారు.
పదేళ్ల పాటు ఎస్ఎల్ బీసీ టన్నెల్ నిర్మాణాన్ని పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. కృష్ణా జలాలను జగన్ ప్రభుత్వం బేసిన్ అవతలకు తరలిస్తుంటే పట్టించుకోలేదు. 299 టీఎంసీలు మన హక్కు అయితే 190 టీఎంసీల కంటే ఎక్కువ ఎప్పుడూ వాడలేదన్నారు. కృష్ణా బేసిన్ లో ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే మన వాటా పూర్తిగా వాడుకునేవాళ్లమన్నారు. ఏదుల, డిండి ప్రాజెక్టులను కూడా పదేళ్లలో పూర్తి చేయలేదని తెలిపారు. కృష్ణా జలాల్లో కేటాయింపులు చెరో సగం కేటాయించాలని వాదన తామే మొదలుపెట్టామని మంత్రి వెల్లడించారు.
తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయని కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) ఒప్పుకుని వచ్చారని మంత్రి స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం ముచ్చుమర్రికి నీళ్లు తరలించుకుపోతుంటే మాట్లాడలేదన్న మంత్రి ఉత్తమ్ శ్రీశైలం ప్రాజెక్టు అట్టడుగు నుంచి కూడా రోజుకో టీఎంసీ తరలించుకుపోతుంటే నోరెత్తలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడకముందు శ్రీశైలం నుంచి రోజుకు 47 వేల క్యూసెక్కులను ఏపీ తరలించుపోయేది, తెలంగాణ ఏర్పడ్డాక శ్రీశైలం నుంచి రోజుకు 1.11 లక్షల క్యూసెక్కులు తరలించుపోయారు. జగన్ తో సఖ్యతగా ఉంటూ ఏపీ నీళ్ల దోపిడీని కేసీఆర్ ఏనాడు అడ్డుకోలేదన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ను కేఆర్ఎంబీకి అప్పగిస్తామని ఒప్పుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేని ఉత్తమ్ క్లారిటీ ఇచ్చారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరగనీయమని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజల హక్కులు కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నామని భరోసా కల్పించారు.