26-02-2025 07:02:22 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): శ్రీశైలం ఎడమ ఒడ్డు కాలువ సొరంగం(Srisailam Left Bank Canal Tunnel)లో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను రక్షించడానికి వరుసగా నాలుగో రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) వద్ద సహాయక చర్యలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సొరంగంలో ఉప్పొంగుతున్న నీరు, మట్టి కారణంగా అధికారులు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఏకీకృత కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయబడింది మరియు 10 అగ్రశ్రేణి రెస్క్యూ ఏజెన్సీలతో సమావేశం నిర్వహించబడింది. ఎన్డీఆర్ఎఫ్, ఆర్ఎటీ మైనింగ్ బృందాలు భారత సైన్యం పాల్గొన్ని నీటిని బురద తొలగించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ఎస్ఎల్బీసీ పూడికలోకి వెళ్లాలని నిర్ణయించామని, రెండు రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ప్రమాద స్థలానికి చేరుకునేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. గ్యాస్ కట్టర్ తో కట్ చేసి దెబ్బతిన్న టీబీఎంను వేరుచేస్తామని, సహాయక చర్యలకు వెళ్లే వారికి ప్రమాదం జరగకూడదని జాగ్రత్తలు తీసకున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. దేశ సరిహద్దుల్లో టన్నెల్స్ నిర్మించే నిపుణలు, ఎక్కడ టన్నెల్ ప్రమాదం జరిగినా సహాయక చర్యల్లో పాల్గొన్నే ఎక్స్ పర్ట్స్ ను తీసుకొచ్చామని ఆయన వెల్లడించారు. బురద, నీటితో పేరుకుపోయిన సిల్డ్ ను పూర్తిగా తొలగించాలని నిర్ణయించినట్లు ఉత్తమ్ చెప్పారు. ప్రకృతి విపత్తును రాజకీయం చేసి లబ్ధిపొందేవారి గురించి తను మాట్లాడదల్చుకోలేదన్నారు.