calender_icon.png 26 April, 2025 | 8:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌: మంత్రి ఉత్తమ్‌

26-04-2025 02:35:34 PM

సీతారాంసాగర్‌ ప్రాజెక్టు, సీతమ్మసాగర్‌ బ్యారేజీలకు కేంద్రం అనుమతి

ఏడాదిన్నర కృషి ఫలించింది

గోదావరి జలాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు

ఇరిగేషన్‌ శాఖలో ఇది పెద్ద ముందడుగు-మంత్రి ఉత్తమ్‌

హైదరాబాద్: హెచ్ఐసీసీలో భారత్ సమ్మిట్-(Bharat Summit)2025 కొనసాగుతోంది. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ నాసిరకం పనులతో ప్రాజెక్టులను నాశనం చేసిందని ఆరోపించారు. అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులకూ ప్రమాదం ఉందని ఎన్ డీఎస్ఏ చెప్పిందన్నారు. రూ. లక్ష కోట్లు వృథా చేస్తే ఇతర దేశాల్లో పెద్ద శిక్షలు పడేవని చెప్పిన మంత్రి ఉత్తమ్ వేల కోట్లు అప్పులు తెచ్చి ప్రాజెక్టులు కట్టారని మండిపడ్డారు. కాళేశ్వరం, అన్నారం, సుందిళ్ల నిరుపయోగంగా ఉన్నా కూడా అత్యధిక పంట పండిందని వివరించారు.

యాసంగిలో 127 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని సూచించారు. తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పారు. సీతారామసాగర్(Seetharama Sagar), సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. ఏడాదిన్నరగా మేము చేసిన కృషి ఫలించిందని వెల్లడించారు. తెలంగాణకు ఇది పెద్ద ముందడుగు అని ఆయన పేర్కొన్నారు. దశాబ్దకాలంగా బీఆర్ఎస్ సాధించలేనిది.. మేం ఏడాదిన్నరలోనే సాధించామని చెప్పారు. గోదావరి జలాల కోసం రైతులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు ఈ ప్రాజెక్టులు ఎంతో ఉపయోగకరం అన్నారు. భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్ రైతులకు ఈ ప్రాజెక్టులు ఉపయోగకరమన్నారు. ఈ రెండు ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.