కాళేశ్వరం విషయంలో మరోసారి ఇంజినీర్ల సమావేశం
జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ సూచన మేరకు ముందుకెళ్తాం
గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును అట్టహాసంగా చేపట్టింది
రూ. లక్ష కోట్లు ఖర్చు చేస్తే.. మేడిగడ్డ పిల్లర్లు 5 ఫీట్లు కుంగాయి
కాళేశ్వరం విషయంలో ఏం చేయాలో ఇంజినీర్లే చెప్పాలి
కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు
న్యూఢిల్లీ: గత బీఆర్ఎస్ ప్రభుత్వ దోపిడీ విధానానికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైపోయిందని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఢిల్లీలో జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. గత ప్రభుత్వం అట్టహాసంగా కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టిందని చెప్పారు. అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టిందన్నారు. రూ. 38 లక్షల కోట్ల అంచనాతో 16 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చేలా ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టిందని తెలిపారు. కాళేశ్వరం విషయంలో మరోసారి ఇంజినీర్ల సమావేశం జరుగుతోందని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కేవలం కమీషన్ల కోసమే చేపట్టారని మంత్రి ఆరోపించారు. ఎక్కువ నిధులు కేటాయిస్తే ఎక్కువ కమీషన్లు వస్తాయని భావించారని విమర్శించారు.
తుమ్మిడిహట్టి వద్ద నీరు లేదని ప్రాజెక్టు రీడిజైన్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కొత్త ఆయకట్టు లక్ష ఎకరాలు కూడా పెరగలేదన్నారు. ఐదేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కింద కేవలం 65 టీఎంసీలు ఎత్తిపోశారని మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. ఏడాదికి సగటున కేవలం 13 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశారని చెప్పారు. కాళేశ్వరం అన్ని పంపులు నడిస్తే కరెంట్ బిల్లు రూ. 13 వేల కోట్లు అవుతోందన్న మంత్రి తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే కరెంట్ బిల్లు కేవలం రూ. ఎయ్యి కోట్లు ఉండేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట ఇప్పటికే రూ. లక్ష కోట్లకు పైగా ఖర్చు చేశారని వెల్లడించారు. రూ. లక్ష కోట్లకు పైగా ఖర్చు చేస్తే మేడిగడ్డ పిల్లర్లు 5 ఫీట్లు కుంగాయని విమర్శించారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిన విషయాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు ఒప్పుకోవట్లేదని ధ్వజమెత్తారు. ఎవరో బాంబు పెట్టి ఉంటారని సమీప పీఎస్ లో ఫిర్యాదు చేశారని తెలిపారు.
కాళేశ్వరం విషయంలో ఏ చేయాలనే దానిపై ఇంజినీర్లతో చర్చిస్తున్నామని పేర్కొన్నారు. జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ సూచన మేరకే ముందుకెళ్తామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. రిపేర్లు చేస్తే.. ఏమైనా పనికి వస్తుందేమో పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇప్పటికైతే అన్ని బ్యారేజీల అన్ని గేట్లు ఎత్తి నీటిని కిందకు వదలాలని ఇంజినీర్లు చెప్పాలి, మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం గేట్లు ఎత్తి నీరు విడుదల చేయాలని ఇంజినీర్లు చెప్పారు. తెలంగాణ ప్రజల అమూల్యమైన సొమ్ముతో ప్రాజెక్టు నిర్మించారని చెప్పిన మంత్రి ప్రజల సోమ్ము దుర్వినియోగం కాకూడదనే తాము భావిస్తున్నామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.