హైదరాబాద్ : రాష్ట్రంలో భారీగా వర్షాలు పడుతుండడంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులను అప్రమత్తం చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో సీఈలు అందరూ హెడ్ క్వార్టర్స్ లోనే అందుబాటులో ఉండాలని ఎవరు అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లరాదని మంత్రి ఆదేశించారు. ప్రాజెక్టుల గేట్లు సరిగా పనిచేసేలా చూసుకోవాలని, వరదనీటిని నిబంధనల ప్రకారం విడుదల చేయాలని సూచించారు.
నీరు వదిలే ముందు కలెక్టర్లు, ఎస్పీలకు సమాచారం ఇవ్వాలని, దీంతో ప్రాజెక్టుల దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తారని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా జాగ్రత్తాలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. క్షేత్రస్థాయి ఇంజనీర్లందరూ కూడా విధుల్లో ఉండేలా చూడాలని ఆదేశించారు. ఏమైనా ఘటనలు జరిగితే నీటిపారుదల కార్యదర్శి, ఈఎన్సీకి తెలపాలనిఅత్యవసర పరిస్థితుల్లో పోలీసు, ఇతర అధికారుల సహాయం తీసుకోవాలని ఉత్తమ్ చెప్పారు.