వేల కోట్లతో వరి ధాన్యం కొనుగోలు ఎక్కడా.. ఎప్పుడూ జరగలేదు
హైదరాబాద్: రాష్ట్రంలో 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. 51 లక్షల టన్నుల ధాన్యం కొని రైతులకు చెల్లింపులు చేశామని, ఈ ఒక్క ఏడాదిలోనే ఖరీఫ్, రబీ పంటలకు కలిపి వరి రైతులకు రూ.42 వేల కోట్ల నుంచి రూ.45 వేల కోట్లు చెల్లిస్తున్నామని మంత్రి తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులను ఇంత భారీగా కొన్న రాష్ట్రం మరొకటి లేదన్నారు.
ఇన్నివేల కోట్లతో వరి ధాన్యం కొనుగోలు ఎక్కడా.. ఎప్పుడూ జరగలేదని, తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఉత్తమ్ చెప్పారు. ధాన్యం కొనుగోళ్లు సమయంలో లారీల కొరత ఉందని అధికారులు చెప్తున్నారని, ఇసుక, సిమెంట్ రవాణా లారీలను వాడుకోవాలని అధికారులను సూచించామని ఆయన వెల్లడించారు. మన రాష్ట్రంలోని రైసు మిల్లుల్లో తెలంగాణ ప్రజలు చాలా తక్కువగా, బిహార్, బెంగాల్ రాష్ట్రాల కార్మికులు ఎక్కువగా పనిచేస్తున్నారు. బెంగాల్ కార్మికులు ఈసారి ఓట్ల కోసం వెళ్లి చాలా మంది తిరిగి రాలేదని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.






